Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైసీపీలో 'రాజ్యసభ' సంబరం

వైసీపీలో 'రాజ్యసభ' సంబరం
, శుక్రవారం, 19 జూన్ 2020 (21:23 IST)
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది.

పోలింగ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగింది. ఐదు గంటలకు ఓట్లు లెక్కించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించినట్లు కౌంటింగ్ ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ ఎన్నికయ్యారు.
 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలుపొందిన అభ్యర్ధులకు ఒక్కొక్కరికి 38 ఓట్లు వచ్చాయి. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోల్ అయ్యాయి. 
 
జగన్‌ కి ధన్యవాదాలు తెలిపిన పరిమళ్‌ నత్వానీ
రాజ్యసభ సభ్యుడిగా తనను పార్లమెంట్‌కు పంపిస్తున్న ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన పరిమళ్‌ నత్వానీ ధన్యవాదాలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడిగా విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తనకు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పార్లమెంట్‌లో పోరాడుతానని, రాష్ట్రానికి సంబంధించి అన్ని హక్కులను సాధించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలతో కలిసి కృషి చేస్తానన్నారు.
 
రాష్ట్ర హక్కుల కోసం ఎంపీలతో కలిసి పనిచేస్తా: పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యే సువర్ణ అవకాశం కల్పించిన సీఎం  వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రాజ్యసభ సభ్యుడు అవుతానని ఊహించలేదని సుభాష్‌ చంద్రబోస్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన స్వర్గీయ రాయవరంకి, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పిస్తున్నానని సుభాష్‌ తెలిపారు.

వీరి ఇరువురికీ జన్మజన్మలకు రుణపడి ఉంటానని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని కోవిడ్ 19 వల్ల మరింత ఇబ్బందుల్లో ఉంది. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. సీనియర్ పార్లమెంటేరియన్‌ విజయసాయిరెడ్డి అడుగుజాడల్లో ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోరాటం చేయాల్సి ఉందని పిల్లి సుభాష్‌ చంద్రబోస్ తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రెవిన్యూలోటు ఉన్న రాష్ట్రం మనదని .. ఆ రెవిన్యూ లోటు కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలని ఉన్నా.. దాన్ని సక్రమంగా పొందలేకపోయామన్నారు. సీనియర్ పార్లమెంటేరియన్‌ సభ్యులతో కలిసి కృషి చేస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు. 
 
విజన్ ఉన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి: అయోధ్య రామిరెడ్డి 
 తనకు మద్దతు ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఈ రోజు చాలా సంతోషంగా ఉందని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు. ఆయన ఆలోచనకు తగ్గట్లు రాష్ట్రానికి, దేశానికి రాజ్యసభ వేదికగా ఎంపీగా చేయాల్సిన పనులు అన్నీ చేస్తామని అయోధ్య రామిరెడ్డి అన్నారు.

దీనికి తగ్గ విధంగా ప్రణాళికా బద్ధంగా వెళ్తామని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. మూడు నెలలు ఎన్నికలు ఆలస్యం అయినా చక్కగా ఎన్నికను నిర్వహించారన్నారు. మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు మరోసారి ధన్యవాదాలు చెప్పారు.
 
బీసీల పక్షపాతి జగన్ మోహన్ రెడ్డి: మోపిదేవి వెంకటరమణ
తన రాజకీయ జీవితంలో ఈరోజు మర్చిపోలేని సుదినమని మోపిదేవి వెంకటరమణ అన్నారు. 1987లో మండల ప్రెసిడెంట్‌గా రాజకీయ జీవితం ప్రారంభించానని రాష్ట్ర స్థాయిలో అన్ని బాధ్యతలు నిర్వర్తించానని ఇంత త్వరగా రాజ్యసభలో ఎంపీ అయ్యే అవకాశం వస్తుందని కలలోనూ ఊహించలేదన్నారు. మా నాయకుడు జగన్ రూపంలో అరుదైన అవకాశం లభించిందని మోపిదేవి తెలిపారు.

రాష్ట్రంలో కార్యకర్త విలువ తెల్సిన నాయకుడుగా విశేష ప్రజాదరణ కలిగినటువంటి సీఎంగా వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వచనాలతో రాజ్యసభకు ఎన్నిక కావటం సంతోషించదగ్గ విషయమని మోపిదేవి అన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి ప్రత్యేకించి అగ్నికుల క్షత్రియుల తరుపున తనకు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు అవకాశం కల్పించటం అనేది గుర్తించుకోదగ్గ విషయమని మోపిదేవి తెలిపారు.

ప్రాంతీయ పార్టీల్లో ఈ స్థాయిలో గుర్తింపు ఇవ్వటమనేది అరుదైన సంఘటన అని మోపిదేవి వెంకటరమణ చెప్పారు.  ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను స్మరించుకోవాల్సి ఉందని తనను రాజకీయాల్లోకి సింగం బసవపున్నయ్య తెచ్చారని.. రాజకీయ ఎదుగుదలకు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రోత్సహించారని మోపిదేవి స్మరించుకున్నారు. 
 
నేటి రాజకీయాల్లో కార్యకర్తలను, కిందిస్థాయి నాయకులను అవకాశాల కోసం మాత్రమే వాడుతున్నారని వాటికి భిన్నంగా రాజకీయ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు.

పార్టీ నుంచి ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులను ప్రోత్సహిస్తూ.. పరిశ్రమలు ప్రోత్సహించటానికి అయోధ్య రామిరెడ్డి, నత్వానీ లాంటి వారికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వారి సహకారంతో రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయని మోపిదేవి తెలిపారు. దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల నుంచి సరైన ప్రాధాన్యత లభించిందన్నారు.

ఇప్పుడు టీడీపీ తరుపున పోటీ చేసిన వర్ల రామయ్య గతంలో ముహూర్తం కూడా చూసుకున్నారు. కానీ గత సంఘటనలకు భిన్నంగా నూతన రాజకీయ ప్రస్థానానికి వైయస్‌ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో శ్రీకారం చుట్టారని మోపిదేవి తెలిపారు. రాష్ట్రాభివృద్దికి సంబంధించి కేంద్రం వద్ద అనేక సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సి ఉందన్నారు.

రాజ్యసభలో పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి నాయకత్వంలో శ్రీ జగన్ గారి డైరెక్షన్‌లో మేం ఎల్లవేళలా పని చేస్తామని మోపిదేవి స్పష్టం చేశారు. ఇద్దరు బీసీలకు రాజ్యసభ సీట్లు జగన్ ఇవ్వటం ద్వారా వైఎస్సార్సీపీ బీసీ సామాజిక పక్షపాతిగా నిరూపణ అయిందన్నారు.

2024నాటికి రాజ్యసభలో 11 మంది సభ్యులు: విజయసాయిరెడ్డి
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశయాల మేరకు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విధివిధానాల మేరకు రాజ్యసభలో మొదట ప్రస్థానం ఒకరి నుంచి ప్రారంభమై, తర్వాత రెండై ఈరోజుకు ఆరు స్థానాలు గెలవటం జరిగిందని ఎంపీ వి.విజయసాయి రెడ్డి తెలిపారు.

జగన్ నాయకత్వంలో 2024 నాటికి ఈ ఆరు స్థానాల నుంచి 11కు చేరుకుంటాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్‌లో 30 మంది సభ్యులు పైబడి ఉంటే ఆ పార్టీకి కేంద్రంలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఉంటుందని  విజయసాయిరెడ్డి అన్నారు.

లోక్‌సభలో, రాజ్యసభలో ఉన్న పార్లమెంట్ సభ్యులు అందరం నాయకుడి ఆశయాలకు, పార్టీ విధివిధానాలకు అనుగుణంగా కలిసి పనిచేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని విజయసాయిరెడ్డి తెలియజేశారు. రాజ్యసభకు మరో నలుగురిని పంపించినందుకు సీఎం గారికి, ఎమ్మెల్యేలకు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్‌ విఠల్ మృతి