ప్రజలకు శాఖాపరమైన సేవలు అందించేదానిలో ఉద్యోగులు ఏదైనా ఆశించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిటిసి ఎస్.వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక బందర్ రోడ్డులోని డిటిసి కార్యాలయంలో జిల్లాలోని అధికారులతో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో డిటిసి మాట్లాడుతూ... ఈ నెల 28 నుండి మార్చి 7వ తేదీ వరకు పాత విధానం (3 టైర్ సాఫ్ట్ వెర్)లో వాహనాల బదిలీలు, ఫైనాన్స్ కు సంబంధించిన పనుల నిమిత్తం కార్యాలయాలకు విచ్చేసిన వాహనదారులకు సత్వర సేవలు అందించేవిధంగా ఉద్యోగుల ఉండాలని, ఏవిధమైన అస్కారానికి తావు ఇవ్వొద్దని డిటీసీ కోరారు.
ఏదైనా ఆశించినట్లు తెలిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని డీటీసీ తెలిపారు. వాహనాలు అమ్మిన యజమానులు, ఫైనాన్సు కంపెనీ యజమానులు అందుబాటులో లేని కారణంగా, బదిలీలు చేసుకోని వాహనాలకు వారం రోజులపాటు పాత విధానంలో (3 టైర్ సాఫ్ట్ వెర్) లో వాహన బదిలీలు, ఫైనాన్స్ లావాదేవీలకు సంబందించిన పనులకు జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, వాహన యజమానులు దరఖాస్తులను చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.
వాహనాన్ని అమ్మిన యజమాని సంతకంలు చేసిన ఫారంలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుతో పాటుగా వాహన రిజిస్ట్రేషన్ పత్రము, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆధార్ కార్డు మొదలగు పత్రాలను కలిగి ఉండాలన్నారు. నకిలీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ పత్రాలతో దరఖాస్తు చేసినట్లయితే దరఖాస్తును తిరస్కరించడమే కాకుండా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
అమ్మిన వాహనదారుడు సంతకంలు చేసిన ఫారంలను కార్యాలయ రికార్డులతో పరిశీలించి యాజమాన్య బదిలీ హక్కును బదలాయింపు చేయడం జరుగుతుందన్నారు. వాహనం అమ్మిన యజమాని చేసిన పత్రములలో సంతకములు కార్యాలయ రికార్డులు ప్రకారము సరి కాకపోయినా, సరైన పత్రాలు జతపరచకపోయిన అటువంటి దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
జిల్లాలోని ఆర్టిఏ కార్యాలయాల్లో ఫీజులకు సంబంధించిన వివరాలతో కూడిన పట్టికలను ఏర్పాటు చేశామని దానికి అనుగుణంగా ప్రభుత్వ ఫీజులను చెల్లించాలని ఆయన తెలిపారు. పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వాహనదారులకు ఏదైనా ఇబ్బందులు వాటిల్లినట్లయితే సంబంధిత కార్యాలయ అధికారులను సంప్రదించాలని, లేదా నేరుగా జిల్లా ఉపరవాణా కమిషనర్ తో ఫోన్ 9848171102 లో సంప్రదించవచ్చని ఆయన అన్నారు.
మధ్యవర్తులను దళారులను ఆశ్రహించవద్దని డిటీసీ సూచించారు. అనంతరం వాహన ఫీజులకు సంబంధించిన వివరాలతో కూడిన పట్టికలను ప్రదర్శించారు. సమావేశంలో జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.