Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్ఆర్సీ వల్ల పౌరసత్వం పోతుందన్న భయాలు వద్దు: పవన్ కళ్యాణ్

Advertiesment
citizenship
, సోమవారం, 27 జనవరి 2020 (22:00 IST)
ఎన్ఆర్సీ భారత దేశంలోని ప్రతి పౌరుడికి వర్తిస్తుందనీ, కేవలం ముస్లింల కోసం మాత్రమే పెట్టింది కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీ వల్ల పౌరసత్వం తీసేస్తారన్న భయాలు ఎవరికీ అవసరం లేదనీ, కొంతమంది ఉద్దేశపూర్వకంగానే మత ప్రాతిపదికన ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఈ అంశానికి సంబంధించి ముస్లిం సోదరుల్లో ఉన్న భయాలు, అపోహలు తొలగించేందుకు ప్రత్యేకంగా ఓ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. న్యాయ నిపుణులతో వారి సందేహాలు నివృత్తి చేస్తామన్నారు. సోమవారం మంగళగిరిలోని జనసేన  పార్టీ కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తలందరినీ పేరు పేరునా ఆత్మీయంగా పలుకరించారు. పశ్చిమ నియోజకవర్గంలోని సమస్యలతోపాటు రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న పరిస్థితులపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “భారత రాజ్యాంగం గొప్పది. మత ప్రాతిపదికన ప్రజల్ని విడదీయదు. మతం పేరుతో మనుషుల్ని విడదీయడం సాధ్యం కాదు. తాత, తండ్రి వివరాలు అందుబాటులో లేకపోతే మీరు భారత పౌరులు కారు అనుకోవద్దు. అది సాధ్యపడదు కూడా. 
 
ప్రభుత్వాలు మారినప్పుడు తమ విధానానికి అనుగుణంగా వివరాలు సేకరిస్తాయి. తెలంగాణలో సకల జనుల సర్వే అని పెట్టినప్పుడు కూడా ఆంధ్రవారిని సపరేట్ చేయడానికని అపోహలు రేపారు. అలాంటివి చేయడం అసాధ్యం. ఆధార్ కోసం వివరాలు కోరినప్పుడు కూడా చాలామందిలో సందేహాలు వచ్చాయి.

ఓ ప్రయివేట్ కంపెనీకి ఇస్తే ఏం జరుగుతుందోనన్న అనుమానం వచ్చింది. అయితే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలి. దేశాన్ని ప్రేమిస్తా... మతానికి అతీతంగా మాట్లాడతా...సిఏఏ తీసుకు వచ్చింది బంగ్లాదేశ్ లాంటి సరిహద్దు దేశాల నుంచి వచ్చే హిందువులు-ముస్లింల కోసం.

ఇది కేవలం ఒక్క ముస్లింల కోసమే అన్నది అబద్దం. అసోంలో వలసల కారణంగా వారి ఉద్యోగాలు పోతున్నాయి, భూముల ధరలు పెరిగిపోతున్నాయన్న భయంతోనే గొడవ. నేను దేశాన్ని ప్రేమిస్తా. మతానికి అతీతంగా మాట్లాడుతా. ఎవరో చెప్పింది విని చట్టం గురించి తెలుసుకోకుండా భయాలు పెట్టుకోవద్దు.

ముందుగా జనసేన పార్టీలో ఉన్న ముస్లిం సోదరులంతా కలసి కూర్చుందాం. ఎవరికి ఎలాంటి భయాలు ఉన్నాయో నివృత్తి చేసుకుందాం. నా వరకు స్వతహాగా దేశ సమగ్రతను కోరుకుంటా. దేశ భక్తిని మత ప్రాతిపదికన కొలవలేం. దేశం విడిపోయినప్పుడు పాకిస్థాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా విడిపోతే, భారత దేశాన్ని మాత్రం హిందూ రిపబ్లిక్ గా చేసే అవకాశం ఉన్నా చేయలేదు.

వాస్తవానికి హిందూత్వం అనేది ఒక జీవన విధానం... మతం కాదు. అందులో దేవుని చూసేందుకు ఎన్నో దారులు ఉన్నాయి. పాకిస్థాన్ విషయానికి వస్తే తూర్పు-పశ్చిమ భాగాల్లోనే ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య హింస ప్రజ్వరిల్లడం బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారి తీసింది. అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న దేశాల నుంచి మన దేశానికి వచ్చే మైనారిటీల కోసమే సీఏఏ తీసుకువచ్చారు. ఎన్ఆర్సీ మాత్రం ప్రతి పౌరుడికీ వర్తిస్తుంది.
 
వైసీపీ సిఏఏకి ఓటేస్తుంది... ఇక్కడకొచ్చి వ్యతిరేకం అంటుంది.. రీఫ్ పై జరిగిన దూషణల గురించి పత్రికల్లో చదివాం. ఆయన పెద్ద తరహాలో వాటిపై ఏమీ మాట్లాడలేదు. జగన్ రెడ్డి  మాటల్లో తేనె రాసుకుని చేతల్లో కత్తులతో పొడిచేస్తారు. అలాంటి వారిని నమ్మకండి. వైసీపీ సిఏఏకి ఓటేస్తుంది... ఇక్కడికొచ్చి వ్యతిరేకం అంటుంది.

నేను ఉన్నదేదో మాట్లాడేస్తాను. వైసీపీ వాళ్లు సెక్యులరిజం అంటారు. కడపలో ముస్లిం సోదరుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అంతా కలసికట్టుగా ఉంటే అపోహలు రావు. మేము నెల్లూరులో ఉండగా రొట్టెల పండుగ చేసుకునే వాళ్లం. అక్కడ అసలు మతం అనేది ఎక్కడ ఉంటుంది. కొత్తతరంలో అయినా మార్పు రావాలి.

భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సమస్యలు వస్తే అవి పార్టీ పరిధిలో మాట్లాడుకుందాం. బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన నేను మతోన్మాదిని అయిపోను. అది నిజంగా మతోన్మాదులు ఉన్న పార్టీ అయితే దేశంలో ఇంత భద్రత ఉండదు.

దేశంలో ఉన్న అన్ని పార్టీలు సెక్యులర్ పార్టీలే. వారి స్టాండ్ మాత్రమే వేరు ఉంటుంది. బీజేపీ సెక్యులర్ పార్టీ కాదు అంటే వైసీపీ ఎలా అవుతుంది. వైసీపీ వాళ్లు చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఉంటుంది.

రాజకీయం అంటే దేశ సేవ...
నా దృష్టిలో రాజకీయం అంటే దేశ సేవ. ఓట్ల కోసం తిట్లు తినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏదైనా నిలబడగలిగితేనే మాట్లాడుతా. సామాన్యుల కోసం నేను జనసేన పార్టీ స్థాపించా. సామాన్యుడు బయటికి వచ్చి మాట్లాడాలి అన్న ఉద్దేశంతో పెట్టాం. ఆ నమ్మకం నిజం అవుతున్నందుకు సంతోషంగా ఉంది.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇళ్ల పట్టాల సమస్యలు, శ్మశానవాటిక ఆక్రమణ.... అన్నింటి మీద నిలబడే వ్యక్తులు పార్టీకి అవసరం. మన విధానాల వల్ల ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోవచ్చు. 25 ఏళ్ల తర్వాత మన బిడ్డలకు బలమైన భవిష్యత్తు అయితే చూపుతా.

సమస్యలపై పోరాటం చేసేప్పుడు కొంత మంది తిడుతూ ఉంటారు. అయితే మనకి సహనం ఉండాలిగానీ మనం లొంగిపోయే స్థాయిలో అది ఉండడం మంచిది కాదు. నేను పెట్టిన పార్టీ కుల, మతాలకు అతీతంగా సకల జనులను రక్షించేది కావాలి అన్న ఉద్దేశంతో జనసేన అని పేరు పెట్టా.

ఎవరి డివిజన్‌లో వారు బాధ్యతలు స్వీకరించండి...
ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమ పడిన అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రియాశీలకంగా పని చేసిన వారందరినీ కలిసి అందరితో ముఖాముఖి మాట్లాడాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కష్టపడి పని చేసిన అందరికీ గుర్తింపు ఇవ్వాల‌న్నదే నా కోరిక.

ప్రతి నియోజకవర్గంలో ఎవరి డివిజన్‌లో వారు బాధ్యతలు తీసుకోండి. ముందుగా కుటుంబానికి, ఉపాధికి సమయం ఇచ్చిన తర్వాత పార్టీకి సమయం ఇవ్వండి. పార్టీకి ఎక్కువ సమయం ఇవ్వగలిగిన వారు ఎక్కువ బాధ్యతలు తీసుకోండి. మీరంతా కూర్చుని ఆలోచించుకుని ఏకాభిప్రాయానికి వచ్చి బాధ్యతలు తీసుకోండి.

నియోజక వర్గానికి సంబంధించి లేవనెత్తిన సమస్యలపై ప్రత్యేకంగా మాట్లాడుతాను అన్నారు. సమావేశంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్, పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాసనమండలి రద్దు దురదృష్టకరం: ఎమ్మెల్సీ మాధవ్