మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు ప్రకటించాలని జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు నిర్ణయించారు.
సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగితే, అందుకు అనుకూలంగా చర్చలో పాల్గొంటానని ఆయన ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు, పరిపాలనా వికేంద్రీకరణ పరంగానూ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై ఓటింగ్ జరిగితే దానికి మద్దతుగానే తాను ఓటు వేస్తానన్నారు. అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యే మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు ప్రకటించడం ఆసక్తి కలిగిస్తోంది.