భారత దేశం పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కావడం లేదని, దాని అవసరం ఏమీ లేదని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. అయినప్పటికీ, ఇది భారత దేశ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు. గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సీ) అనేవి భారత దేశ అంతర్గత వ్యవహారాలని బంగ్లాదేశ్ ఎప్పుడూ చెప్తోందన్నారు. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్ఆర్‌సీ కేవలం భారత దేశ అంతర్గత వ్యవహారమని తనకు చెప్పారన్నారు. 2019 అక్టోబరులో తాను న్యూఢిల్లీ వెళ్లినపుడు తనకు మోదీ వ్యక్తిగతంగా హామీ ఇచ్చారన్నారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లలో మతపరమైన హింస, వేధింపులకు తట్టుకోలేక భారత దేశానికి 2014 డిసెంబరు 31నాటికి వచ్చినవారికి పౌరసత్వం ఇచ్చేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించారు. ఈ మూడు దేశాల్లో ముస్లింలు మెజారిటీ కాబట్టి, అక్కడి మైనారిటీలు భారత దేశానికి వస్తే, పౌరసత్వం ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశం.