అధికారంలోకి రాకముందు అన్నదాతల అడుగులకుమడుగులొత్తుతామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, గద్దెనెక్కగానే రైతులనోట్లో మట్టికొట్టాడని, రైతుభరోసా పేరుతో ఏటా రూ.12,500 ఇస్తామనిచెప్పి, ఇప్పుడు కేంద్రం ఇస్తున్న రూ.6వేలు తనజేబులో వేసుకొని అన్నదాతలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నాడని టీడీపీ సీనియర్‌నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మండిపడ్డారు.
ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాటతప్పను, మడమతిప్పను, మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పినవ్యక్తి, తానిచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఏటా ప్రతిరైతు కుటుంబానికి రూ.12,500చొప్పున నాలుగేళ్లలో రూ.50వేలు ఇస్తానని చెప్పడం జరిగిందన్నారు.తనమేనిఫెస్టోను తూచాతప్పకుండా అమలుచేస్తానని చెప్పి, దాన్ని పాదయాత్రలో, బహిరంగసభల్లో చదివి వినిపించిన జగన్, అధికారంలోకి రాగానే దానిగురించి తనకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని నరేంద్ర ఆక్షేపించారు.
తానిస్తానన్న రూ.12,500లకు పంగనామాలు పెట్టి, గతంలోనే కేంద్రం ఇచ్చిన రూ.6వేలను కూడా తానే ఇచ్చినట్లు చెప్పుకుంటూ, ఇప్పుడు కేవలం రూ.6,500లతో సరిపెట్టి రైతుభరోసా పేరుతో రైతులపై పెనుభారం మోపిన ఘనచరిత్ర వైసీపీ సర్కారుకే దక్కిందని మాజీఎమ్మెల్యే దెప్పిపొడిచారు. అన్నంపెట్టే అన్నదాతకు కూడా కులంరంగు పులిమిన కుత్సితపార్టీ వైసీపీ అని నరేంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతుభరోసా పేరుతో ప్రభుత్వమిచ్చిన జీవో-96లోని నియమ నిబంధనలను పరిశీలిస్తే ఈవిషయాలన్నీ బయటపడతాయన్నారు. సోషియోఎకనమిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 53లక్షలమంది రైతులున్నారని, కౌలురైతులు 15లక్షలమందని చెప్పిన రాష్ట్రప్రభుత్వం, బడ్జెట్‌లోమాత్రం రైతుభరోసా పథకం కింద 64లక్షలమంది రైతులకు రూ.8750కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించడం జరిగిందన్నారు.
మరోవైపు రాష్ట్రవ్యవసాయమంత్రి కేంద్రప్రభుత్వం అనర్హులైనరైతులకు, అడ్డగోలుగా డబ్బులిచ్చిందని, తమప్రభుత్వం అర్హులకు మాత్రమే న్యాయం చేస్తుందంటూ పొంతనలేని ప్రకటనలిచ్చాడని ధూళిపాళ్ల తెలిపారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రంలోని 45లక్షలమంది రైతులకు రూ.6వేల వంతున ఎప్పుడో నిధులిస్తే, దాన్ని తప్పుపట్టడం రాష్ట్రవ్యవసాయమంత్రి కన్నబాబు అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కేంద్రం ఇచ్చిన 44లక్షలమంది 4లక్షలమంది అనర్హులున్నా రని మంత్రి ఎలాచెప్తాడని నరేంద్ర ప్రశ్నించారు.
సాయంచేస్తామని చెప్పి, రైతుల్ని కులమతాల పేరుతో విడదీస్తారా?
రైతుభరోసా పథకం కింద రాష్ట్రప్రభుత్వం విధించిన నిబంధనలను పరిశీలిస్తే, అసలు జగన్మోహన్‌రెడ్డి రైతులకు మంచిచేయాలనే ఆలోచనా ఉందా అనే అనుమానం వస్తుందన్నారు.
విస్తీర్ణం ఇంతమాత్రమే ఉండాలని, ఒకరైతుకు ఉన్న పదెకరాల్ని ఇద్దరు, ముగ్గురు కౌలురైతులు సాగుచేసుకుంటుంటే, వారిలో ఒక్కరికి మాత్రమే నిధులిస్తామని, ఎస్సీ,ఎస్టీ, బీసీలకు మాత్రమే కౌలురైతులుగా గుర్తిస్తామని, వారిలో కూడా ఎవరుముందుంటే వారినే అర్హులుగా నిర్ణయిస్తామని చెప్పడం వైసీపీ ప్రభుత్వ నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమని మాజీఎమ్మెల్యే మండిపడ్డారు.
రైతులకు న్యాయంచేస్తామని చెప్పిన జగన్, తనతండ్రిపేరుతో పథకాన్ని ఆరంభించి, దివంగతవైఎస్ ఆత్మఘోషించేలా నిబంధనలు విధించాడన్నారు. ఎన్నికలముందు రైతులకు మాయమాటలుచెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక సాయం విషయంలో మాత్రం కులమతాల ప్రస్తావన తేవడం దుర్మార్గమని నరేంద్ర మండిపడ్డారు.
రాష్ట్రంలో దాదాపు 76లక్షలమంది రైతులుంటే, 15లక్షలమంది కౌలురైతులున్నారని, వారిలో ఈ ప్రభుత్వం ఎంతమందికి న్యాయంచేసిందో సమాధానంచెప్పాలన్నారు.
వారిలో ఎల్‌ఈసీ కార్డులున్నవారు 5.13లక్షలమందికాగా, కౌలురైతు గుర్తింపుకార్డులున్నవారు 5.67లక్షలమందని, వీరుగాక, 2004కు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం కౌలురైతుల్ని రైతుమిత్ర బృందాలుగా ఏర్పాటుచేస్తే, తరువాత వచ్చిన కాంగ్రెస్‌ప్రభుత్వం జాయింట్ లయబులిటీ బృందాలుగా మరికొందర్ని గుర్తించడం జరిగిందన్నారు.
రైతుమిత్రగ్రూపుల్లో 3.43లక్షల మందిఉంటే, జాయింట్‌లయబులిటీ గ్రూపుల్లో 2.52లక్షలమంది రైతులుంటే, కౌలురైతు గుర్తింపుకార్డులున్నవారు, ఇతరేతర చిన్న,సన్నకారు రైతుల్ని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా వారిసంఖ్య 32లక్షల వరకు ఉంటుందని నరేంద్ర వివరించారు.
రైతుల్ని ఉద్ధరిస్తామని చెబుతున్న జగన్‌సర్కారుకి ఈ 32లక్షలమంది ఎందుకు కనిపించడం లేదని, వారిలో ఎందరికి రైతుభరోసా వర్తింపచేశారని నరేంద్ర ప్రశ్నించారు. సోషియో ఎకనమిక్‌సర్వే ప్రకారం రాష్ట్రంలో 53లక్షలమంది ఉంటే, వారిలో 40 లక్షలమందికే రైతుభరోసా వర్తింపచేస్తామని వ్యవసాయమంత్రి చెప్పడం, వైసీపీప్రభుత్వ కోతలు, వాతలకు నిదర్శనమని ధూళిపాళ్ల ఎద్దేవాచేశారు.
సొంతకమతాలున్నవారు, కౌలురైతులు కలిపి రాష్ట్రంలో కోటిమంది ఉంటారని, వారిలో ఎంతమందిని ఈప్రభుత్వం ఆదుకుందో వైసీపీ స్పష్టంచేయాలన్నారు. దేశచరిత్రలో మొట్టమొదటిసారి రైతుల్ని కులాలు, మతాలపేరుతో విడగొట్టిన జగన్, తనలోని కులతత్వాన్ని అన్నదాతలకుకూడా ఆపాదించాడన్నారు.
జగన్ ఇస్తున్న భరోసావల్ల రైతులకు న్యాయం జరగకపోగా, వారిలోవారికి మనస్పర్థలు సృష్టించేది గా, వారిమధ్యకూడా కొట్లాటలు జరిపించేదిగా ఉందని నరేంద్ర తెలిపారు. వైసీపీ వచ్చిన 4నెలల్లోనే 150మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారికుటుంబాలను ఇంతవరకు ఆదుకోలేదని, ఇప్పటికైనా నిబంధనలు, కులమతాలకతీతంగా రైతులను ఆదుకోవాల్సిన గురుతరబాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉందని నరేంద్ర తేల్చిచెప్పారు.