ఉత్తర్ప్రదేశ్ రైతులు దిల్లీలోని కిసాన్ ఘాట్ వద్దకు భారీగా తరలివచ్చారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడం లేదని నిరసన చేపట్టారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న చెరకు పంట బకాయిలు, రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్ రైతులు పోరుబాట పట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడం లేదని నిరసనలు చేపట్టారు. యూపీ నోయిడాలోని సెక్టార్-69 నుంచి దిల్లీలోని కిసాన్ ఘాట్ వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న చెరకు పంట బకాయిల చెల్లింపు, రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్... యూపీ రైతుల ప్రధాన డిమాండ్లు.
రైతుల ర్యాలీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులతో యూపీ రైతులు శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
అనంతరం దిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు రైతులు. ఆందోళనల దృష్ట్యా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అప్రమత్తమైంది. అక్టోబరు 31 లోగా రైతులకు బకాయిలు చెల్లించాలని చక్కెర మిల్లుల యజమానులను ఆదేశించింది. చెరకు సాగులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది యూపీ.