ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జవాద్ తుఫాను ముప్పు తప్పింది. దీంతో ప్రభుత్వం యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన వివరాల మేరకు జవాద్ తుఫాను బలహీనపడింది. పైగా, ఇది దిశ మార్చుకుని ఒరిస్సా వైపు వెళ్లినట్టు పేర్కొంది. ఫలితంగా ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు పొంచివున్న పెను ముప్పు తప్పింది.
ప్రస్తుతం ఈ తుఫాను పశ్చి మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, ఒరిస్సా రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌కు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుందని ఐఎండీ వెల్లడించింది.
ముఖ్యంగా, గడిచిన 6 గంటలుగా చాలా నెమ్మదిగా కదులుతుంది. గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఈ తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని వెల్లడించింది. ఆదివారం ఒరిస్సా తీరానికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
మరోవైపు, రాగల 24 గంటల్లో ఇంకా బలహీనపడుతుందని, ఇది క్రమంగా పశ్చిమ బెంగాల్ వైపు వెళుతుందని వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, తీవ్రం వెంబడి 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.