ఆంధ్రప్రదేశ్‌ను పెథాయ్ తుఫాను అతలాకుతలం చేసింది. పెథాయ్ తుపాను తీరం దాటినప్పటికీ మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవడంతో పాటు చల్లటి గాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పెథాయ్ తాకిడి నేపథ్యంలో 28 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.
తుపాను రాకముందు నాలుగు పడవల్లో సముద్రంలోకి వెళ్లిన జాలర్లు, అక్కడే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దుమ్ములపేట, ఉప్పలంక, పర్లాపేటకు చెందిన 28 మంది జాలర్ల జాడ ప్రస్తుతం తెలియరావడం లేదని అధికారులు చెప్తున్నారు. దీంతో గల్లంతయిన జాలర్ల కోసం అధికారులు రంగంలోకి దిగి గాలింపును మొదలెట్టారు. అంతకుముందు సముద్రంలో ఓఎన్ జీసీ రిగ్ వద్ద చిక్కుకున్న ఏడుగురు జాలర్లను రక్షించగలిగారు.
పెథాయ్ తుపాను ప్రభావంతో ఇప్పటికే 23 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తమ కుటుంబ సభ్యుల జాడ తెలియకపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా పెథాయ్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులకు పలు జిల్లాల్లో పంటలు నేలకొరగగా, అక్వా రైతులు సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.