ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచివుంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్యంగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకొస్తుంది. గులాబ్ అని నామకరణం చేసుకున్న ఈ తుఫాను గోపాలపురానికి తూర్పు ఆగ్నేయంగా దాదాపు 500 కిలో మీటర్లు, కళింగపట్నానికి తూర్పుగా 600 కిలోమీటర్ల దూరానా కేంద్రీకృతమైంది.
ఇది తీవ్ర వాయుగుండంగా మారి, మరి కొన్ని గంటలు పశ్చిమ వాయవ్యంగానే పయనించి అనంతరం పశ్చిమ నైరుతి దిశగా మరలి ఆదివారం సాయంకాలానికి దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్రల మధ్య తీరం దాటే అవకాశమందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో శనివారం ఒరిస్సా, కోస్తాంధ్రలలో అక్కడక్కడ భారీ జల్లులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
అలాగే ఆదివారం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్రలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల కుంభవృష్టి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 27 న కోస్తాంధ్రలో సాధారణ వర్షాలు, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఒడిసాలోనూ భారీ వర్షాలు కొనసాగుతాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని... మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
అయితే, ఈ వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారి ఆ తర్వాత తుపానుగా మారే అకాశమున్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ తుఫానుకు గులాబ్ అనే పేరు పెట్టారు. ఈ తీవ్రవాయుగుండం తుఫాను మారి విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్‌ల మధ్య ఈనెల 26న తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.