నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావం కారణంగా ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.
బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బుధవారం అర్ధరాత్రి తర్వాత వాయుగుండగా, ఆ తర్వాత కొద్దిగంటల్లోనే తీవ్ర వాయుగుండంగా అనంతరం తుపానుగా రూపాంతరం చెందింది. దీనికి యెమన్ దేశం దిత్వా అనే పేరు పెట్టింది. తుపాను గంటకు 10 నుంచి 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్యంగా పయనిస్తోంది. గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలైకు 170, పుదుచ్చేరికి 570, చెన్నైకి 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ నెల 30వ తేదీ ఉదయానికి తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వైపు రానుందని ఐఎండీ తెలిపింది. పలు వాతావరణ సంస్థల సమాచారం మేరకు 30 ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావం కోస్తాలో కోనసీమ జిల్లా నుంచి నెల్లూరు వరకూ, రాయలసీమలో కొన్ని జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.
శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు.. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అతిభారీ, ప్రకాశం, బాపట్ల, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి.
తుఫాన్ తీరం దాటే సమయంలో(ఆదివారం) రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు.. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల కుంభవృష్టిగా, బాపట్ల, పల్నాడు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో అతిభారీగా, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అతిభారీ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచిక ఎగురవేశారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. శుక్రవారం నుంచి కోస్తాంధ్రలో తీరం వెంబడి గాలుల వేగం పెరగనున్నది. శనివారం నుంచి తీరం వెంబడి గంటకు 60 నుంచి 70, అపుడప్పుడు 80 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ తుపాను ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.