మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటరుపై సీపీఐ ఎమ్మెల్యే కూనం సాంబశివరావు స్పందించారు. హిడ్మాను హత్య చేసి ఎన్‌కౌంటర్ అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన మావోలకు, భద్రతా బలగాలకు జరిగిన ఎన్‌కౌంటరులో హిడ్మాతో పాటు అనేక మంది నక్సలైట్లు హతమైన విషయం తెల్సిందే. దీనిపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందిస్తూ, 'మావోయిస్టుల ఎన్‌కౌంటర్లను తక్షణమే ఆపివేయాలి. ఎన్‌కౌంటర్లపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. మావోయిస్టుల పక్షాన న్యాయ పోరాటం చేస్తాం. హిడ్మా కోరితే ఆశ్రయం ఇచ్చే వాళ్లం. అతన్ని నేనే డీజీపీకి సరెండర్ చేయించే వాడిని. హిడ్మాను చంపి ఎన్‌కౌంటర్ అంటున్నారు.
ఎన్‌కౌంటర్ అంటే పరస్పరం కాల్పులు జరపడం. ఏకపక్షంగా కాల్పులు జరపడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్‌కౌంటర్ అంటున్నారు. మావోయిస్టులతో చర్చించి సమస్యలను తెలుసుకోవాల్సింది పోయి చంపుతున్నారు. 2026 మార్చి కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అంతం చేయడానికి ఇదేమైనా యుద్ధమా? కాల్పులు విరమించుకుంటున్నామని ప్రకటించినా చంపుతున్నారు. దండకారణ్యంలో ఖనిజ నిక్షేపాల కోసమే మావోయిస్టుల ఏరివేత పేరుతో మారణహోమం సృష్టిస్తున్నారు' అని కూనంనేని ఆరోపించారు.