తిరుపతిలో ఓ విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ బారినపడిన ఓ నర్సు ఆ వైరస్ మహమ్మారి నుంచి కోలుకుంది. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్‌స్ సోకింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ మహిళ ఆస్పత్రిలోని బాత్రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి రాష్ట్ర కోవిడ్ 19 ఆస్పత్రిలో ఆదివారం జరిగింది. ఈమె పేరు జయమ్మ. వయసు 60 యేళ్లు.
ఈ విషయంలో తిరుపతి ఆర్డీవో కె.నరసారెడ్డి మాట్లాడుతూ, మే 4వ తేదీన కరోనా వైరస్ బారినపడిన ఈ నర్సుకు మెరుగైన వైద్య సేవలు అందించండంతో మే 13వ తేదీన కోలుకుంది. అయితే, మే 25వ తేదీ తిరుపతిలోని స్విమ్స్ క్యాంపస్‌లో ఉన్న కోవిడ్ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ వైరస్ సోకడంతో మళ్లీ చేరింది. అప్పటి నుంచి ఆమెకు చికిత్స అందిస్తూరాగా, ఆమె ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
అదేసమయంలో కొవిడ్‌తో చికిత్స పొందుతున్న చిత్తూరు జిల్లా కలికిరి మండలం రంగనాథపురానికి చెందిన వినోద్ కుమార్(27) పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. అదేరోజు మరో ఇద్దరు బాధితులు మరణించారని సాయంగా ఉన్నవారు పేర్కొన్నారు. దీంతో కొవిడ్ కేంద్రంలో చికిత్స పొందుతున్న కొవిడ్, బ్లాక్‌ఫంగస్ బాధితుల సహాయకులు ఆందోళనకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చికిత్స కోసం లోపలకు వెళ్లిన వారు శవాలుగా తిరిగివస్తున్నారని ఆరోపించారు.
నెల్లూరుకు చెందిన జయమ్మ అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేసేది. నెల క్రితం ఆమె కరోనా బారినపడి కోలుకున్నారు. బ్లాక్ ఫంగస్ సోకడంతో చికిత్స నిమిత్తం బంధువులు ఆమెను గత నెల 25న స్విమ్స్‌లో చేర్పించారు. ఆదివారం తెల్లవారుజామున ఆమె మరుగుదొడ్డిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. తన కుమారుడు వినోద్‌కుమార్‌ను ఆస్పత్రి సిబ్బందే చంపేశారని ఆయన తండ్రి ఆరోపించారు. శనివారం రాత్రి కూడా ఫోన్‌లో బాగానే మాట్లాడాడని... తెల్లవారుజామున మీ కొడుకు చనిపోయాడని చెప్పడం అనుమానంగా ఉందన్నారు. ఈ ఘటనలపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్డీవో కనక నరసారెడ్డిలతో మాట్లాడారు.
వినోద్‌కు ఆక్సిజన్ లెవల్స్ 36శాతానికి పడిపోవడం వల్ల ఎంత ప్రయత్నించినా ఆరోగ్యం క్షీణించి మృతిచెందారని ఆళ్లనాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక జయమ్మ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినా.. మంత్రి మాత్రం దాన్ని సాధారణ మృతిగా చెప్పడం గమనార్హం.