తిరుపతిలో వెలుగు చూసిన నిత్య పెళ్లికూతురు కేసు తెలంగాణలోనూ ప్రకంపనలు రేకెత్తించింది. ఓ యువతి వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ, లక్షల్లో బురిడీ కొట్టిస్తూ నిత్య పెళ్లికూతురు ముద్ర వేయించుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. సుహాసిని అనే యువతి ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకోగా, మూడో పెళ్లి కొడుకు ఫిర్యాదుతో ఆమె బండారం బట్టబయలైంది. ఇపుడు తెరపైకి రెండో భర్త రావడంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొత్తగూడెంకు చెందిన వినయ్ అనే వ్యక్తి ఇపుడు తాను సుహాసిని రెండో భర్తనంటూ తెరపైకి వచ్చాడు. తనను కూడా సుహాసిని రూ.15 లక్షల మేర మోసగించిందని తెలిపాడు. తనను తాను అనాథగా పరిచయం చేసుకుందని, 2018లో తామిద్దరికి పరిచయం ఏర్పడిందని వినయ్ తెలిపాడు.
అనాథనని చెప్పడంతో, ఆ మరుసటి ఏడాదే పెళ్లి చేసుకున్నానని వెల్లడించాడు. పెళ్లి సమయంలో వెంకటేశ్వరరాజు అనే వ్యక్తిని మేనమామగా పరిచయం చేసిందని, ఇద్దరు పిల్లలను తీసుకువచ్చి మేనకోడళ్లు అని చెప్పిందని వినయ్ వివరించాడు.
అయితే, నెల రోజుల తర్వాత నుంచి సుహాసిని ప్రవర్తనలో తేడా కనిపించిందని చెప్పాడు. ఆమె మొదట చెప్పిన మేనమామే ఆమె తొలి భర్త అని, మేనకోడళ్లుగా పరిచయం చేసిన పిల్లలు ఆమె పిల్లలేనని వెల్లడైందని వినయ్ తెలిపాడు.
ఈ విషయంలో తాను మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, అప్పటి సీఐ ఫిర్యాదు స్వీకరించలేదని, ఇది జరిగిన కొన్నిరోజులకే ఇంట్లో నగదు, బంగారం తీసుకుని సుహాసిని గోడ దూకి పారిపోయిందని తెలిపాడు.
ఇప్పుడు తిరుపతిలో ఆమె మూడో పెళ్లి వ్యవహారం తెలియడంతో అందరి ముందుకు వచ్చానని వినయ్ పేర్కొన్నాడు. సుహాసిని తన మొదటి భర్త వెంకటేశ్వరరాజుతో కలిసి మోసాలకు పాల్పడుతోందని, ఆమె మోసాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశాడు.