తిరుమలలో భక్తులకు గదుల కేటాయింపును టీటీడీ మరింత సులభతరం చేసింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జీఎన్‌సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, రామ్‌భగీచా, ఎంబీసీ, సీఆర్‌వో వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు ఎస్ఎంఎస్ ద్వారా గదుల కేటాయింపు సమాచారం వస్తుంది. ఎస్ఎంఎస్ రాగానే నగదు చెల్లించి గదిని పొందేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
మరోవైపు 2021 మార్చి నుండి మే వరకు రోజువారీ లక్షల విరాళాలు వచ్చాయి. ఈ మూడు నెలల్లో దేశం కరోనా మహమ్మారి ప్రభావంతో భయానక స్థితిని చూసింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం మళ్లీ లాక్‌డౌన్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే వీటన్నిటి మధ్య, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ ఆలయంలో దర్శనం, విరాళం ఇచ్చే ప్రక్రియ కొనసాగింది.
అయితే, సందర్శకుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. 2021 ఏప్రిల్-మే నెలల్లో ప్రతిరోజూ సగటున 5000 మంది తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు. 50 లక్షలకు పైగా విరాళాలు స్వామివారికి అందాయి. దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో తిరుపతి ఆలయం మొదటిది. కరోనా మొదటి తరంగంలో, ఈ ఆలయం 2020 మార్చి 20 నుంచి 2020 జూన్ 7 వరకు పూర్తిగా మూసివేశారు.
ఈ రోజుల్లో ఆలయానికి అందిన విరాళాలు చరిత్రలో మొదటిసారిగా జీరోకు పడిపోయాయి. గతేడాది మొత్తం స్వామివారికి వచ్చిన విరాళం సుమారు 731 కోట్లు. ఇది 2019-20 సంవత్సరంతో పోలిస్తే సుమారు 500 కోట్లు తక్కువ అని అధికారులు తెలిపారు.