Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ టీకాపై అపోహలు వ‌ద్దు: ఉప రాష్ట్రపతి

కోవిడ్ టీకాపై అపోహలు వ‌ద్దు: ఉప రాష్ట్రపతి
విజయవాడ , మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (15:06 IST)
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకాకరణ ఒక్కటే సరైన ప్రత్యామ్నాయమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. టీకాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు, ఆందోళనలను పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన సూచించారు. టీకా తీసుకోవడం ద్వారా ఒకవేళ కరోనా సోకినా తీవ్రమైన ఆరోగ్య  సమస్యలు తలెత్తకుండా, ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి తప్పుతుందన్న నిపుణుల సూచనలను, పలు అధ్యయనాల నివేదికలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.
 
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత టీకాకరణ శిబిరాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని స్వర్ణభారత్ ట్రస్ట్ కేంద్రాల్లో (హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు) ఏక కాలంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు ప్రాంగణాల్లో కలుపుకుని దాదాపు 5వేల మందికి టీకాలు వేశారు.
 
కరోనాతో సాగుతున్న పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద టీకాకరణ కార్యక్రమాన్ని చేపడుతోందని, దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చి విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
 
ఉచిత కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వాహకులకు,  ఈ కార్యక్రమంలో భాగస్వాములైన భారత్ బయోటెక్, ముప్పవరపు ఫౌండేషన్, మెడిసిటీ హాస్పిటల్స్ (హైదరాబాద్),  సింహపురి వైద్య సేవాసమితి (జయభారత్ హాస్పిటల్స్–నెల్లూరు), పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్స్ (విజయవాడ) వారిని ఉపరాష్ట్రపతి అభినందించారు.
 
ఈ సందర్భంగా భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ, గతంలో భారతదేశంలో టీకాలను దిగుమతి చేసుకోవడం ద్వారా ఎక్కువగా ఖర్చుచేయాల్సి వచ్చేదని, కానీ దేశీయంగా టీకాలను రూపొందించుకుని ఉత్పత్తి చేయడం ద్వారా ఖర్చును తగ్గించుకోవడంతోపాటు మన దేశంలో అన్ని ప్రాంతాల్లో టీకాలు అందించేందుకు వీలుంటుందన్నారు. హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని కేంద్రాలనుంచి కూడా కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సతీమణి ఉషమ్మ, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస్, హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి సుబ్బారెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి, ట్రిపుల్ ఒలింపియన్  ఎన్ ముకేశ్ కుమార్ పాల్గొనగా, స్వర్ణభారత్ ట్రస్ట్ నెల్లూరు చాప్టర్ నుంచి సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు (గ్రామీణం) శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు  జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, స్వర్ణభారత్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్,  ముప్పవరపు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ముప్పవరపు హర్షవర్ధన్, సింహపురి వైద్య సేవా సమితి నిర్వాహకులు నాగారెడ్డి హరికుమార్ రెడ్డితోపాటు, విజయవాడ చాప్టర్ నుంచి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గన్నవరం శాసన సభ్యులు వల్లభనేని వంశీ మోహన్, స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ సెక్రటరీ చుక్కపల్లి ప్రసాద్, స్వర్ణభారత్ ట్రస్ట్ ట్రస్టీ గ్రంధి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కస్టమర్లను అలర్ట్​ చేసిన ఎస్బీఐ.. సెప్టెంబర్​ 30లోపు..?