Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుటుంబ సమేతంగా హంపి నగరాన్నిసందర్శించిన ఉప రాష్ట్రపతి

Advertiesment
కుటుంబ సమేతంగా హంపి నగరాన్నిసందర్శించిన ఉప రాష్ట్రపతి
విజయవాడ , శనివారం, 21 ఆగస్టు 2021 (16:58 IST)
ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం కుటుంబ సమేతంగా చారిత్రక హంపి నగరాన్ని సందర్శించారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఇలాంటి ప్రదేశాల గురించి తెలుసుకోవడం ద్వారా యువతలో మనోబలం, ఆత్మవిశ్వాసం పెరిగి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కాగలరని ఆకాంక్షించారు.
 
ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన హింపిలో విజయనగర సామ్రాజ్య గతవైభవపు ఆనవాళ్ళు ఉన్నాయన్న ఉపరాష్ట్రపతి, నాటి శిల్పకళాశైలి ఎవరినైన మంత్ర ముగ్ధుల్ని చేస్తుందని తెలిపారు. మౌనంగా ఉండే రాళ్ళను, చైతన్యంతో కూడిన శిల్పాలుగా మలచిన శిల్పుల కళా చాతుర్యానికి ఈ నగరం నిదర్శనమని, ఇక్కడి ప్రతి రాయి ఓ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందని తెలిపారు. బహుమనీ సుల్తానులు విజయనగర చారిత్రక సంస్కృతిని, ఆలయవైభవాన్ని నేటమట్టం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, హింపీ శిథిలాలు సైతం నాటి చరిత్రను మనకు తెలియజేస్తున్నాయని తెలిపారు.
 
వ్యక్తిగతంగా శ్రీ కృష్ణదేవరాయలను తాను ఎంతో అభిమానిస్తుంటానన్న ఉపరాష్ట్రపతి, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయగిరి నియోజక వర్గం సైతం రాయలవారి సామ్రాజ్యంలో భాగంగా ఉండేదని తెలిపారు. రాయల వారి కాలంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా, వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తించి రైతుల కోసం చెరువులు తవ్వించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల్ని. కన్నబిడ్డల్లా చూసుకోవడమే కాకుండా, మన సంస్కృతిని, కళలను ప్రోత్సహించారని, ఆయన లాంటి ఆదర్శవంతమైన రాజులు చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తారని తెలిపారు.
 
ఇక్క‌డి రాజమందిరం, గరుడ పుణ్యక్షేత్రం (రాతి రథం), విరూపాక్ష దేవాలయం, వినాయకుని చిత్రాలు, లక్ష్మీ నృసింహిడు, బడవిలిగం, విజయ విఠల దేవాలయం, గజశాల, పుష్కరిణి, పద్మ మహల్, హజారా రామ దేవాలయం, మహానవమి దిబ్బ, రాణుల స్నాన వాటికలు వంటి చారిత్రక కట్టడాలు హంపి వైభవాన్ని తెలియజేస్తున్నాయని తెలిపారు.
 
తాను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో హంపిని సందర్శించానని, నాటి రోజులను గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, ఇప్పుడు మనుమడు, మనవరాళ్ళతో కలిసి ఇక్కడకు రావడం, మన చరిత్ర సంస్కృతుల గురించి వారికి తెలియజెప్పడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇక్కడి చారిత్రక సంపదను సంరక్షిస్తున్న పురావస్తు శాఖ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా హంపిలోని విరూపాక్ష స్వామి వారి ఆలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో రెండేళ్లలో తెరాస ప్రభుత్వం అడ్రస్‌ గల్లంతు: కిషన్‌రెడ్డి