ఏపీ రాజధానిపై కేంద్రం మాట మార్చింది. గతంలో ఏపీకి మూడు రాజధానులంటూ ఆర్టీఐ కార్యకర్త చైతన్యకుమార్‌రెడ్డికి సమాధానమిచ్చింది.
కేంద్రం సమాధానంపై అమరావతి జేఏసీ అధ్యక్షుడు జీవీఆర్ శాస్త్రి హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ రాజధానిపై తప్పును కేంద్రం సరిదిద్దుకుంది. ఏపీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందంటూ మరో లేఖను కేంద్ర హోంశాఖ పంపింది.
కాగా ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ నిర్ణయాన్ని అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తోంది. అటు రాజధాని రైతులు కూడా నిరసనను కొనసాగిస్తున్నారు. ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ తప్ప అన్ని పార్టీలు ఒకే రాజధానికి జై కొట్టాయి. అయితే అటు కేంద్రం మాత్రం రాజధాని నిర్ణయం స్థానిక ప్రభుత్వానిదేనని పదే పదే చెప్పింది.
తాజాగా కోర్టు పరిధిలో ఉందని అంటోంది. దీంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా పరిణామం కూడా ఇందుకు నిదర్శనమవుతోంది.