ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితురాలైన ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లో వాదనలు వినిపించడానికి చివరిగా ఓ అవకాశం ఇస్తున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది. ఈ నెల 29న వాదనలు వినిపించని పక్షంలో ఏకపక్షంగా విచారణ చేపట్టి ఉత్తర్వులు వెలువరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్ వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన కేసులో సోమవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ఈ కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ వై.శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది తెలిపారు.
గత ఏడాది తాము పిటిషన్ దాఖలు చేయగా సీబీఐ కౌంటరు కూడా వేసిందని.. ఈ నెల 25న అది విచారణకు రానుందని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఈ కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులేవీ ఇవ్వలేదన్నారు. అందువల్ల వచ్చే విచారణ నాటికి వాదనలు వినిపించాల్సిందేనంటూ ఈ నెల 29కి వాయిదా వేశారు.
కొన్ని పత్రాలు అందించాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందంలు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణనూ అదే తేదీకి వాయిదా వేశారు.
హెటిరో, పెన్నా కేసులు వాయిదా
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా నమోదైన అరబిందో, హెటిరో, పెన్నా సిమెంట్స్ కేసులూ వాయిదా పడ్డాయి. అరబిందో, హెటిరో వ్యవహారంలో నిందితులైన హెటిరో కంపెనీతోపాటు ఎండీ శ్రీనివాసరెడ్డి తమపై కేసు కొట్టివేయాలని వ్యాజ్యాలు దాఖలు చేశారు.
వీటిలో విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కొవిడ్ నేపథ్యంలో అన్ని మధ్యంతర ఉత్తర్వులను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ హైకోర్టు ఫుల్ బెంచ్ ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో హెటిరో కేసు విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.
పెన్నా కేసులో నిందితుల జాబితాలో ఉన్న పయనీర్ హోల్డింగ్స్ వేసిన డిశ్ఛార్జి పిటిషన్‌ను సాంకేతిక అభ్యంతరాలతో సీబీఐ కోర్టు కార్యాలయం తిప్పిపంపింది. ఇదే కేసులో మరో కంపెనీ పి.ఆర్.ఎనర్జీ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.