ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయికి చేరింది. ఫలితంగా ఈ జిల్లాలో ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే ఏకంగా 327 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఒక్క రోజే ఏకంగా ఆరు వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 65 మంది ప్రాణాలు కోల్పోయారు.
అదేసమయంలో కరోనాను కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... ఇప్పటివరకు 3010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి నెల్లూరులో లాక్డౌన్ విధించబోతున్నారు. జూలై 24 నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుంది.
ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉంటుంది. మెడికల్ షాపులు, పాల బూత్‌లకు మాత్రం సాయంత్రం వరకు అనుమతి ఉంటుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో లాక్డౌన్ అమలవుతోంది.