కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఆస్పత్రిలోనూ ఐసొలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కరోనా వైరస్ నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సేకరిస్తున్న వివరాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా లక్షణాలతో ఏ రోగి వచ్చినా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ వార్డులోనే ఉంచి చికిత్స చేయించాలని చెప్పారు. వైద్యులు, సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని, అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఢిల్లీలో జమాత్ సదస్సుకు హాజరైనవారితో, వారి ప్రాథమిక స్థాయి పరిచయస్తులందరికి వెంటనే పరీక్షలు పూర్తిచేయాలని చెప్పారు. మలివిడతలో ద్వితీయ స్థాయి పరిచయస్తులసై దృష్టి సారించాలని సూచించారు. క్వారంటైన్, ఐసోలేషన్ మార్గదర్శకాలను సంపూర్ణంగా పాటించాలని, రోగులకు మంచి సదుపాయాలు అందేలా చూడాలన్నారు.
ఏప్రిల్ 14 తర్వాత కేంద్రప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడంపై సమాయత్తం కావాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రెడ్‌జోన్లు, హాట్ స్పాట్ల ప్రాంతాల్లో లాక్‌డౌన్ అనంతరం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తిస్థాయిని అంచనా వేయడానికి ప్రయోగాత్మకంగా విశాఖపట్నంలో క్లస్టర్ల వారీగా నిర్వహించిన ల్యాబ్ పరీక్షల ఫలితాలను సిఎంకు అధికారులు వివరించారు. కరోనా పాజిటివ్ కేసులున్న రెడ్‌జోన్లను ఎనిమిది క్లస్టర్లుగా విభజించి ఒక్కోక్లస్టర్ నుంచి 20 నమూనాలు చొప్పున తీసుకుని పరీక్షించామని అన్ని నెగెటివ్ వచ్చాయని అధికారులు వివరించారు.