Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాదాస్పదమవుతున్న తితిదే నిర్ణయం!

వివాదాస్పదమవుతున్న తితిదే నిర్ణయం!
, గురువారం, 8 జులై 2021 (08:10 IST)
ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేస్తూ తితిదే ధర్మకర్తల మండలి తీసుకొన్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది.
 
2008లో తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లో కేటాయించిన స్థలాలను రద్దు చేస్తూ... నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాదిరేడు అటవీ ప్రాంతానికి తరలించేందుకు యత్నించడంపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. న్యాయం కోసం తితిదేపై న్యాయపోరాటం చేసేందుకు వారంతా సిద్ధమవుతున్నారు.
 
బృహత్తర ప్రణాళిక అమలులో భాగంగా తిరుమలలో ఉన్న ఉద్యోగుల నివాస గృహాలను తిరుపతికి తరలించేందుకు తితిదే చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం ఉద్యోగులకు శాపంగా మారింది.1983లో ఉద్యోగుల కోసం తితిదే హౌసింగ్‌ స్కీం ప్రవేశపెట్టింది. 
 
సీనియారిటీ ఆధారంగా తిరుపతితో పాటు శివారు ప్రాంతాల్లో వారికి స్థలాలు కేటాయించారు. 2007లో ఎస్వీ పూర్‌ హోం వద్ద 454 మందికి, తుమ్మలగుంట సమీపంలోని డెయిరీఫాంలో 400 మందికి, బ్రాహ్మణపట్టు వద్ద 921 మందికి, వినాయకనగర్‌లో 600 మందికి, కేశవాయుని గుంటలో 390 మందికి ... మొత్తం 2వేల 795 ఉద్యోగులకు స్థలాలు ఇచ్చారు.
 
వీటిలో మౌలిక వసతుల కల్పన కోసం దాదాపు 20 కోట్ల రూపాయలు వెచ్చించి... రహదారుల, విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేసింది. తితిదే కేటాయించిన స్థలాల్లో ఉద్యోగులు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 
 
కొందరు ప్రహరీలు నిర్మించుకోగా మరికొందరు మంచినీటి బోర్లు వేసుకున్నారు. ఉద్యోగులకు స్థలాల కేటాయింపు అక్రమమంటూ కొన్ని ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయించగా... అక్కడా ఉద్యోగులకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. 
 
మార్కెట్‌ ధరకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని న్యాయస్థానం ఆదేశాలివ్వగా ... అందుకు అనుగుణంగానే డబ్బులు చెల్లించి స్థలాలు తీసుకొనేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ప్రజా సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. 
 
ఉద్యోగ సంఘాలు, తితిదే సుప్రీం కోర్టులో తమ వాదనలు వినిపించాయి.  సర్వోన్నత న్యాయస్థానంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఉద్యోగులు భావిస్తున్న సమయంలో  వారి ఆశలపై తితిదే నీళ్లు చల్లింది. 
 
2007లో కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేస్తూ ఇటీవల వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన చివరి పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశారు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చే సమయంలో ధర్మకర్తల మండలి తీసుకొన్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
 
హైకోర్టు తీర్పు మేరకు ఒక్కో ఇంటి స్థలానికి ఉద్యోగులు 5 లక్షలు చెల్లిస్తే తితిదేకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయినా కేటాయించిన స్థలాలను రద్దు చేస్తూ ధర్మకర్తల మండలి తీర్మానం చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
తితిదేపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు రద్దు చేస్తూ తితిదే తీసుకున్న నిర్ణయం వివాదాస్పమవుతోంది. ధర్మకర్తలి మండలి నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్వంలో రాకాసి సునామీలు!