శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై గదులు దొరకడం అసాధ్యమనే ప్రచారం చాలా మంది భక్తుల్లో ఉంది. కానీ, తితిదే అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని సులభంగానే గదులను బుక్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ విషయంపై తితిదే అధికారులు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఇందులో తిరుమలలో అందుబాటులో ఉన్న గదులను ఎలా బుక్ చేసుకోవచ్చో వివరించారు.
ఈ వీడియో ప్రకారం.. తిరుమలకు వచ్చిన భక్తులు గదుల కోసం తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (సీఆర్ఓ)కు వెళ్లి అక్కడ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, దర్శనం టిక్కెట్, మొబైల్ నంబర్ తదితర వివరాలతో ఒక దరఖాస్తు ఫామ్‌ను నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కార్యాలయ సిబ్బందికి దాన్ని అందిస్తే వారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన 30 నిమిషాల్లో మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబరుకు మనకు కేటాయించిన గది వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ వస్తుంది. ఇక సీఆర్‌వో కార్యాలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తుంది. అయితే, ఈ గదుల కేటాయింపు మాత్రం తొలుత వచ్చినవారికి మాత్రే ఇస్తారు. సింగిల్ వ్యక్తికి గది ఇవ్వరు. కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాల్సివుంది. అలాగే, గదుల బుకింగ్ కోసం ఎలాంటి అడ్వాన్స్ సొమ్మును చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.