పాకిస్థాన్ దేశంలో పుట్టిన ఓ యువతి ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంలో ఉంటోంది. గత 19 యేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఉంటున్న ఆ యువతి గోప్యత పహల్గాం ఉగ్రదాడితో వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కర్నాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన మహబూబ్ పీరన్ దేశ విభజన సమయంలో పాకిస్థాన్ వెళ్లిపోయారు. ఆయనకు అక్కడే ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. చిన్న కుమార్తె జీనత్ పీరన్‌ను ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలోని తన చెల్లెలు కుమారుడు రఫిక్ అహ్మద్‌కు ఇచ్చి 1989లో వివహం జరిపించారు. ఈ జంటకు తొలుత కుమారుడు జన్మించాడు. 1998లో జీనత్ రెండోసారి గర్భందాల్చింది. అయితే, ఆ సమయంలో పాక్‌లోని తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదన్న సమాచారంతో ఆమె తండ్రిని చూసేందుకు పాకిస్థాన్‍కు వెళ్లింది. తిరిగి వచ్చేందుకు ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో భారత్ పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం మొదలైంది. దీంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
అప్పటికే నిండు గర్భిణి కావడంతో అక్కడే రంశా రఫీక్ అనే బిడ్డకు జన్మనిచ్చింది. 2005లో జీనత్ తిరిగి ధర్మవరంకు చేరుకుంది. రంశా రఫీక్ పాకిస్థాన్‌లో పుట్టడంతో ఆమెకు అక్కడి పౌరసత్వం లభించింది. తర్వాత ధర్మవరం వచ్చి చదువు కొనసాగించినప్పటికీ రంశా భారత పౌరసత్వం కోసం ప్రయత్నించలేదు. ఈ క్రమంలో 2018లో పాక్ పౌరసత్వాన్ని పనరుద్ధరించుకున్నారు. 2028 వరకు పౌరసత్వం ముగడలో ఉంటుంది. 2023లో భారత పౌరసత్వం కోసం రంశా దరఖాస్తు చేసుకున్నప్పటికీ దాన్ని అధికారులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఇపుడు భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, భారత్‌లోని పాక్ పౌరులంతా దేశాన్ని వీడి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో పాక్ పౌరసత్వం కలిగిన రంశా భారత్‌లోనే ఉంటారా? లేదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.