ఒకేసారి 3 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు... ఎక్కడ?
అమరావతి : రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో వివిధ గృహనిర్మాణ పథకాల ద్వారా బలహీనవర్గాల లబ్దిదారులకు నిర్మించిన 3 లక్షల ఇళ్లలో జూలై 5వ తేదీన సామూహిక గృహప్రవేశాలను జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర సమాచార, గ్రామీణ
అమరావతి : రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో వివిధ గృహనిర్మాణ పథకాల ద్వారా బలహీనవర్గాల లబ్దిదారులకు నిర్మించిన 3 లక్షల ఇళ్లలో జూలై 5వ తేదీన సామూహిక గృహప్రవేశాలను జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహనిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పండుగ వాతావరణంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో జూలై 5న ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
మూడు లక్షల ఇళ్లలో ఒకేసారి గృహప్రవేశాలు నిర్వహించడం ఒక మహత్తర ఘట్టమని, ఇళ్లు నిర్మించుకున్న లబ్దిదారులంతా ఈ సామూహిక గృహప్రవేశ మహోత్సవంలో పెద్దఎత్తున పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో గృహప్రవేశాల కార్యక్రమం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది జూన్ వరకు గత పదిహేను నెలల కాలంలో గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయడం జరిగిందని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా గత ఏడాది అక్టోబరులో ఒక లక్ష ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. మిగిలిన మూడు లక్షల ఇళ్ల ప్రారంభోత్సవాన్ని జూలై 5న చేపట్టనున్నామని తెలిపారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో వివిధ గృహనిర్మాణ పథకాల ద్వారా 5.61 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి లబ్దిదారులంతా సిద్ధంకావాలని, తమ సొంత ఇంటి కల నెరవేరుతున్న యీ సందర్భాన్ని ఘనంగా జరుపుకొనేందుకు ముందుకు రావాలన్నారు.