ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్లకు అవార్డులు అందించే కార్యక్రమంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లకు మనసారా సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. వలంటీర్లలో ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్ తో పోరాటంలో వలంటీర్ల పాత్ర ఎనలేనిదని కితాబునిచ్చారు.
వలంటీర్ల తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని, రాష్ట్రంలో పరిపాలన అంటే ఏమిటో చూపించామని సీఎం జగన్ పేర్కొన్నారు. అయితే, వలంటీర్ వ్యవస్థలపై విపక్షాలు దారుణంగా మాట్లాడుతున్నాయని అన్నారు. పండ్లు ఇచ్చే చెట్లపైనే రాళ్లు పడతాయని, నిజాయతీగా పనిచేస్తే ఎవరికీ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
అలాగే, జగన్ ఇంకా మాట్లాడుతూ, 'ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే చేరుస్తూ మన్ననలు పొందుతున్నారు. రూపాయి లంచం లేకుండా పెన్షన్ అందిస్తున్న మీరు గొప్ప సైనికులు. పేదల బాధలు తెలుసుకున్న మీరు గొప్ప మనస్సున్నవారు. ఒక వ్యవస్థలో వివక్ష లేకుండా వాలంటీర్లు పని చేస్తున్నారు. కుటుంబంలో ఒక వ్యక్తిలా నేడు వాలంటీర్ భావిస్తున్నారు.
ఇలాంటి వ్యవస్థపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మీరు క్రమశిక్షణతో ఉండి.. ఇలాంటి విమర్శలు పట్టించుకోవద్దు. పండ్లు ఉన్న చెట్టుపైనే రాళ్లు వేస్తారు.. వారి పాపానికి వారే బాధ్యులు. ధర్మాన్ని నెరవేర్చాలని కోరుతున్నా. మానవ సేవే మాధవ సేవ.. అని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో కూడా మరింత సేవ అందించాలని కోరుతున్నానని సీఎం జగన్ అన్నారు.
సేవా దృక్పథం పనిచేస్తున్న వాలంటీర్లకు అవార్డులు అందజేస్తున్నాం. అత్యుత్తమ సేవలను వాలంటీర్లు అందిస్తున్నారు. సేవా మిత్ర అవార్డుకు రూ.10 వేలు, సేవా రత్న అవార్డుకు రూ.20 వేలు, సేవా వజ్ర అవార్డుకు రూ.30 వేలతో వాలంటీర్లకు పురస్కారాలు అందజేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
ఈ పురస్కారాలకు ప్రభుత్వం 240 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం అందిస్తామని వెల్లడించారు. నేటి నుంచి ప్రతి జిల్లాలో రోజుకొక నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, జగనన్న సైన్యం సేవ చూసి చంద్రబాబు కుళ్లుకుంటున్నారని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. నేడు ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. మాట తప్పకుండా ప్రజలకు సీఎం జగన్ సేవ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ పాలన చూసి దేశం మొత్తం గర్వపడుతోందన్నారు.
సీఎం జగన్ పథకాలను మిగతా రాష్ట్రాల సీఎంలు కాపీ కొడుతున్నారన్నారు. రాష్ట్రం మొత్తంలో వలంటీర్ పేరు చెప్పలేని ఇల్లు ఉండదని.. గ్రామ వార్డు వాలంటీర్‌లు అందరూ బాగా పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పనిచేయాలని కోరుతున్నానని మంత్రి పిలుపునిచ్చారు.