ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తుంది. తన మంత్రివర్గం సహచరులతో మూకుమ్మడి రాజీనామాలు చేయించిన ఆయన ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీరిలో నలుగురు మినహా మిగిలిన వారందరికీ కొత్త వారికి అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం జరిగింది.
అయితే, సీఎం జగన్ ఒక్క రోజు రాత్రికే మనస్సు మార్చుకున్నారు. రాజీనామా చేయించిన 24 మంది మంత్రుల్లో పది మందికి మళ్లీ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా పాత మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులను మాత్రం కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాంటి వారిలో పది మందిని మళ్లీ మంత్రులను చేయొచ్చని తెలుస్తుంది.
పాత మంత్రులను కొనసాగించే పరిస్థితి ఏర్పడిన పక్షంలో సీనియర్లు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, తానేటి వనితలకు మళ్లీ మంత్రులుగా అవకాశం కల్పించవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల్లో కొత్త మంత్రివర్గ కూర్పుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.