ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో ఎక్కారు. సామాన్యుడిలా ఆటోలో ప్రయాణించి.. ఆటోవాలా కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం, గూడెం చెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను సీఎం చంద్రబాబు అందించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు మాట్లాడారు.
అలాగే అలివేలమ్మ చిన్న కుమారుడు, ఆటోడ్రైవర్ జగదీష్‌తో మాట్లాడారు. అదే ఆటోలో సీఎం చంద్రబాబు వేదిక వరకు ప్రయాణించారు.20 నిమిషాలు ఆటో ప్రయాణంలో ఆటో నడిపే డ్రైవర్ తమ్ముని కష్టసుఖాలు తెలుసుకొని కారు నడపటం వచ్చా లేదా అని విచారించి కుటుంబ పోషణకు టాక్సీ నడుపు కోవటానికి ఒక ఎలక్ట్రికల్ కారు ఇవ్వమని అధికారులకు అక్కడికక్కడే చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
అంతకుముందు ప్రజావేదికలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు, రాయలసీమ అభివృద్ధికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలోని నీటిపారుదల ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం పూర్తవుతాయన్నారు. అన్ని ట్యాంకులు నిండిపోయేలా చూస్తామని, ప్రస్తుతం సముద్రంలోకి ప్రవహిస్తున్న నీటిని ఉపయోగించడం ద్వారా కరువు ప్రమాదాన్ని తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి తథ్యమని చంద్రబాబు నాయుడు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని, మొదటి దశ డిసెంబర్ 2028 నాటికి పూర్తవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.