సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ విషయంలో తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏంటో పాకిస్థాన్‌కు తెలుసొచ్చింది. మొన్నటివరకు ఈ అంశంలో తీవ్ర స్వరంతో మాట్లాడిన దాయాది ఇపుడు ఆత్మరక్షణలో పడినట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్.. సింధూ జలాల విషయంలో వెనక్కి తగ్గేదే లే అని ప్రకటించడంతో ఇపుడు కాళ్ళ బేరానికి వచ్చింది. నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది.
సింధూ జలాలు నిలిపివేస్తే పాక్‌లో తీవ్ర దుర్బిక్షం నెలకొంటుందంటూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ లేఖ రాసినట్టు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రోటోకాల్‌లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్టు తెలుస్తోంది. అయితే, రక్తం, నీరు, రెండూ కలిసి ప్రవహించలేదంటూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. పాక్‌తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనే అని పేర్కొన్నారు.