ఏప్రిల్ 22న పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పౌరులను చంపిన పహల్గామ్ దాడుల తర్వాత భద్రతా చర్యల నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన అన్ని కంటెంట్‌ను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది.
సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులో, "భారతదేశంలో పనిచేస్తున్న అన్ని పాకిస్థాన్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా స్ట్రీమింగ్, వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఇతర స్ట్రీమింగ్ కంటెంట్‌ను వెంటనే నిలిపివేయాలని కోరింది. జాతీయ భద్రత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది.
"భారతదేశంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు పాకిస్తాన్ కేంద్రంగా వివిధ సంస్థలతో సరిహద్దు సంబంధాలు ఉన్నాయని నిర్ధారించబడింది. ఇటీవల, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అనేక మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించగా, అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే.
అంతకుముందు, భారతదేశంపై రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుడు కథనాలను వ్యాప్తి చేశారనే ఆరోపణలతో డాన్, జియో న్యూస్ వంటి ప్రధాన మీడియా సంస్థలు, అలాగే ఇర్షాద్ భట్టి, అస్మా షిరాజీ, ఉమర్ చీమా వంటి జర్నలిస్టులతో సహా 15 కి పైగా పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను భారతదేశం నిషేధించింది. 3.5 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా తొలగించారు.