అల్లోపతి, ఆయూష్‌ల సమన్వయంతో కరోనా వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయూష్ కమిషనరు పి.ఉషారాణి చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో ఆయూష్ కళాశాల వైద్యులకు నిర్వహించిన పోస్ట్ కరోనా మేనేజ్‌మెంట్ శిక్షణను ఆమె ప్రారంభించారు.
ఉషారాణి మాట్లాడుతూ కరోనా రోగులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పాటించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 400మంది ఆయూష్ వైద్యులు అందించిన ముందస్తు చికిత్సా విధానాలు మంచి ఫలితాలిచ్చాయని చెప్పారు. మారుమూల గ్రామాల్లో 2లక్షల మందికి కరోనా నివారణ కోసం ఆయుర్వేద మందులను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
గుడివాడ ప్రాంతంలో చేపట్టిన ప్రయోగాత్మక చర్యల్లో భాగంగా ఉచిత కరోనా మందులు వాడిన వారికి వ్యాధి సోకలేదని నిర్ధారణైందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందిన శాస్త్రీయ విధానాలపై ఆయుర్వేద వైద్యులకు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 25 ఆయూస్ స్పెషాలిటీ కేంద్రాల ద్వారా కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సాధారణ చికిత్సల్లో భాగంగా చంటిబిడ్డలకు సోకే డయేరియా, ఊపిరితిత్తుల వ్యాధులకు చికిత్స అందించనున్నామని, భవిష్యత్తులో తల్లిపాలు పెంచేందుకు గర్భవతులకు, బాలింతలకు ఆయూష్ మందులు ఉచితంగా అందించనున్నామని పేర్కొన్నారు.
శిక్షణ కార్యక్రమంలో ఆయూష్ శాఖ అడిషినల్ డైరెక్టరు డాక్టర్ సాంబమూర్తి, రీజనల్ జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ కేవీ రమణ, డాక్టర్ శేఖర్, ఆయూష్ వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాయిసుధాకర్, ఫిజియోథెరపీ వైద్యనిపుణులు డాక్టర్ వోలాస్, కరోనా వైద్యనిపుణులు డాక్టర్ శిరీషా, ఆయూష్ కళాశాలల వైద్యులు పాల్గొన్నారు.