Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడే జాబిల్లిపైకి బాహుబలి ప్రయాణం.. మధ్యాహ్నం 2.43 గంటలకు స్టార్ట్

Advertiesment
నేడే జాబిల్లిపైకి బాహుబలి ప్రయాణం.. మధ్యాహ్నం 2.43 గంటలకు స్టార్ట్
, సోమవారం, 22 జులై 2019 (10:50 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2 ప్రయోగాన్ని సోమవారం చేపట్టనుంది. ఇందుకోసం ఆదివారం కౌంట్‌డౌన్ ప్రారంభంకాగా, సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు నింగిలోకి వెళ్లనుంది. ఈ ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్ సెంటర్ కేంద్రంగా ఉంది. జీఎస్ఎల్వీ మార్క్ 3ఎం1 రాకెట్ చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. 
 
నిజానికి ఈ నెల 15వ తేదీనే ఈ ప్రయోగం చేపట్టాల్సివుంది. కానీ, ప్రయోగానికి 56 నిమిషాల ముందు తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రయోగాన్ని వాయిదావేశారు. ఈ లోపాన్ని సరిచేసిన శాస్త్రవేత్తలు తిరిగి సోమవారం ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌‌ను ప్రారంభించారు. 
 
కాగా, బాహుబలిగా వర్ణించే జీఎస్‌ఎల్వీ మార్క్‌3ఎం1 రాకెట్‌ బరువు 640 టన్నులు. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్‌-2 కంపోజిట్‌ మాడ్యూల్‌తో ఈ రాకెట్‌ పయనిస్తుంది. చందమామ చెంతకు వెళ్లేందుకు రాకెట్‌ సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ ప్రయోగంలో రాకెట్ ప్రయాణ సమయం 16.31 నిమిషాలుగా ఉంటుంది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత చంద్రయాన్‌-2 మాడ్యూల్‌ను రోదసిలో వదిలి పెడుతుంది. ఇలా భూమికి 170.06 కి.మీ. దగ్గరగా, 39.120 కి.మీ. దూరంగా ఉండే దీర్ఘ వృత్తాకారపు భూ కక్ష్యలోకి చంద్రయాన్‌ మాడ్యూల్‌ చేరుకున్న వెంటనే కర్ణాటక బైలాలులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం దానిని తన అధీనంలోకి తీసుకోనుంది.
 
కాగా, ఈ రాకెట్ చంద్రుడి వద్దకు చేరుకునేందుకు 48 రోజుల సమయం పట్టనుంది. భూ కేంద్రం నుంచి చంద్రయాన్‌-2 మాడ్యూల్‌లోని ద్రవ ఇంధనాన్ని అనేక పర్యాయాలు మండిస్తూ కక్ష్యలను మార్పుచేస్తూ చంద్రుడి వైపు పయనింపజేస్తాయి. 23వ రోజున చంద్ర బదిలీ కక్ష్యలోకి చొప్పించనున్నారు. ఆ తర్వాత ఆర్బిటర్‌ సంచరించే కక్ష్యను చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకారంగా ఉండేలా చేస్తారు. 
 
48వ రోజున అంటే సెప్టెంబరు 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దిగేందుకు ఆర్బిటర్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ విడిపోతుంది. జాబిల్లిపై దిగిన వెంటనే విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వస్తుంది. దిగిన ప్రదేశానికి 500 మీటర్ల పరిధిలో 14 రోజులపాటు సంచరిస్తూ ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రునిపై పరిశోధనలు చేయనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బియ్యం లేక అన్నం వండలేదని చెప్పింది.. అంతే కాళ్లు, చేతులు కోసేశాడు..