తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి, కేంద్ర బలగాలతో తిరిగి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు.
ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కి ఆయన లేఖ రాశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో జరిగిన అక్రమాలపై తగు చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని లేఖలో పేర్కొన్నారు.
తిరుపతి ఉపఎన్నికలో స్థానికేతరులు వేలకొద్ది దొంగ ఓట్లు వేశారని.. వారిని అరికట్టడంలో పోలీసులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తిరుపతిలో తిష్టవేసి ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న స్థానికేతరుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.
దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టించిన తెదేపా శ్రేణులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అక్రమాలకు సంబంధించిన వీడియో, ఫొటో ఆధారాలను తన లేఖతో పాటు జతచేశారు.