Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు, లోకేష్‌ పనై పోయింది: మంత్రి పేర్ని నాని

Advertiesment
చంద్రబాబు, లోకేష్‌ పనై పోయింది: మంత్రి పేర్ని నాని
, సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:05 IST)
చంద్రబాబు, లోకేష్‌ పనై పోయిందన్నారు ఏపీ మంత్రి శ్రీ పేర్ని నాని. ఆయన వైసిపి కార్యాలయంలో మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో వలంటీర్లు ఎంతో విశిష్ట సేవలందిస్తున్నారు. వారిలో చాలా మంది ఉన్నత విద్యావంతులు. వారి సేవలు గుర్తిస్తూ, ప్రభుత్వం ఇప్పుడు సత్కరిస్తోంది. అందుకు రాష్ట్రంలో ఉన్న 2.60 లక్షల వలంటీర్లకు అభినందనలు. పెన్షన్ల పంపిణీ మొదలు ప్రతి ప్రభుత్వ పథకాన్ని వలంటీర్లు ప్రజల ముంగిటకు చేరుస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీలు అవినీతికి కేరాఫ్‌గా మారితే, ఇప్పుడ ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా, అర్హత ఉంటే చాలు ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. అందుకు మరోసారి వారికి శుభాకాంక్షలు’.
 
అందుకే దుష్ప్రచారం:
‘ఇవాళ తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీకి జెండా తప్ప, ఎజెండా ఏమీ లేదు. వారికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. రాష్ట్రానికి ఏం చేశామన్నది చెప్పుకోవడానికి బీజేపీ వద్ద ఏమీ లేదు. అందుకే చంద్రబాబు, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. దుష్ప్రచారం చేస్తున్నాయి.
కానీ మా ప్రభుత్వం గత 22 నెలలుగా ఏం చేశామన్నది చెబుతూ, ఇంకా ఏమేం చేస్తామన్నది ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతున్నాం’.
 
వారివసలు నాలుకలేనా?
‘సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కోవడ్‌ వ్యాప్తిని గుర్తించి తిరుపతిలో తన ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకుంటే, చంద్రబాబు ఆయన కుమారుడు ఓడిపోతామన్న భయంతోనే రావడం లేదని విమర్శిస్తున్నారు. అంతకు ముందు తిరుపతిలో ఎన్నికల ప్రచారసభ నిర్వహిస్తానని అంతకు ముందు చెబితే, తాము గొప్పగా ప్రచారం చేస్తున్నాం కాబట్టి, ఓడిపోతామన్న భయంతో, మా దెబ్బకు భయపడి సీఎం ప్రచారానికి వస్తున్నారని చంద్రబాబు, లోకేష్‌ విమర్శించారు. అసలు వారివి నాలుకలేనా? అంత పచ్చిగా మాటలను ఎప్పటికప్పుడు ఎలా అన్వయం చేసుకుంటారు?’.
 
ప్రజల శ్రేయస్సు పట్టదు:
‘బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రచార సభను రద్దు చేసుకున్నారు. కానీ మీకు మాత్రం ప్రజల ఆరోగ్యం పట్టదు. మీ రాజకీయ స్వార్థం తప్ప. జగన్‌ గారు ప్రచారసభను రద్దు చేసుకుంటే, ఆయన కరోనాకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కానీ నిజానికి కరోనాకు భయపడి హైదరాబాద్‌లో దాక్కుంది ఎవరు?. మీకున్న కరోనాను తిరుపతి ప్రజలకు అంటిస్తూ, సమాజహితం లేకుండా ప్రజలను ఒకేచోటికి చేరుస్తున్నారు. మీకు ప్రజల శ్రేయస్సు అస్సలు పట్టదు’. ‘ప్రజల ఆరోగ్యం కోసమే తాను ప్రచారానికి రావడం లేదని చెబుతూ, తిరుపతి ప్రజలకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. అది ఆయన బాధ్యతాయుతమైన పద్ధతి’.
 
నిర్లజ్జ విమర్శలు:
‘చంద్రబాబు, లోకేష్‌ పనై పోయింది. తమకు జూనియర్‌ ఎన్టీఆర్‌ రావాలని టీడీపీలో కార్యకర్తలతో పాటు, సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా కోరారు. ఇప్పుడు తండ్రీ కొడుకులు ఇద్దరూ నిర్లజ్జగా అసభ్యంగా మాట్లాడుతున్నారు. సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు తనకు రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని చెబుతారు. కానీ ఏం లాభం? కొడుక్కు మంచి రాజకీయం నేర్పకపోయినా, నోరు తెరిస్తే బూతులు మాట్లాడకుండా, సంస్కారవంతంగా మాట్లాడేలా నేర్పలేదు. ఇది చంద్రబాబు దిగజారుడు రాజకీయం’.
 
రాష్ట్రానికి ఏం చేశారని?:
‘ఇక బీజేపీ. ఈ ఏడేళ్లలో రాష్ట్రానికి ఏం చేశామన్నది చెప్పలేరు. అందుకే ఎంత సేపూ మత రాజకీయాలు. చీకట్లో దేవతా విగ్రహాలు పగలగొట్టడం, ఆ తర్వాత పొర్లుడు దండాలు పెట్టడం. ఇవాళ రాష్ట్రానికి కావాల్సింది మతమా? మత రాజకీయాలా?. మీరు అసలు రాష్ట్రానికి ఏం చేశారని మీ పూవు గుర్తుకు ఓటేయాలి?. అదే మేము తిరుపతిలో పాజిటివ్‌గా ముందుకు పోతున్నాం. ఏం చేశామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం. ప్రజల శ్రేయస్సు కోరి, రాజకీయ స్వార్ధం కూడా పక్కనబెట్టి, తన ప్రచార సభను రద్దు చేసుకున్నారు’.
 
‘కానీ టీడీపీ నేతలు మాత్రం స్వార్థం కోసం ప్రజలను పోగేస్తున్నారు. అలా వారు ఎంత మందికి కరోనా అంటిస్తున్నారో తెలియడం లేదు. వారికి రాజకీయాలే ముఖ్యం. ప్రజలు కాదు. రాష్ట్రంలో బీజేపీ ప్రచారానికి జేపీ నడ్డా వస్తున్నారు. రాష్ట్రానికి ఏం చేశామని చెప్పి ఓటగుతారు? విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్ముతున్నామని, కడప స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి చేశామని, రామయ్యపట్నం పోర్టు కట్టామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా లక్ష కోట్లు వచ్చాయని, ఎందరికో ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ఓట్లు అడుగుతారా?’.
 
యం.ధర్మరాజు. ఎంఏ:
‘ఇక సునిల్‌ దేవధర్‌. ఆయనను చూడగానే నాకు ఎందుకో మోహన్‌బాబు సినిమా.. యం.ధర్మరాజు, ఎంఏ గుర్తుకు వస్తుంది. అందులో మోహన్‌బాబు పాత్రకు, ఈ సునిల్‌ దేవధర్‌కు తేడా కనిపించడం లేదు. ఆయన తిరుపతి ఎన్నికల ప్రచారం కోసం వచ్చాడు. కానీ ఏరోజు నామాలు లేకుండా ఉండడం లేదు. ఈ నామాలు కేవలం తిరుపతి ఎన్నికల కోసం వచ్చినప్పటి నుంచే. అంతకు ముందు ఎప్పుడూ కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదు’.. అంటూ మంత్రి శ్రీ పేర్ని నాని పలు ఫోటోలు చూపారు.
 
పంగనామాలు..:
‘మరి సునిల్‌ దేవధర్‌ పెట్టుకున్నవి నామాలా? లేక పంగనామాలా? రాష్ట్రానికి పంగనామాలు పెట్టిన వాళ్లు, ముఖాన నామాలు పెట్టుకుని, యాక్షన్‌ చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరు. ఇది తెలుసుకోండి’.
 
రెఫరెండంగా భావిస్తున్నాం:
‘ఇక విషం చిమ్ముతున్న టీడీపీ, బీజేపీ పెద్దలకు ఒకటే మాట. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో మా పరిపాలనకు రెఫరెండం అని చెప్పాం. ఇప్పుడు కూడా తిరుపతి ఉప ఎన్నికను, 22 నెలల సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పాలనకు రెఫరెండంగా చెబుతున్నాం. ఈ 22 నెలల పాలనలో సీఎం శ్రీ వైయస్‌ జగన్, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా?. అని అడుగుతూ ఈ ఎన్నికను రెఫరెండంగా భావిస్తున్నాం’.
 
మరి మీరు?:
‘మరి చంద్రబాబు అంతకు ముందు తన 5 ఏళ్ల పాలనలో ఏం చేశారు? రాష్ట్రానికి మేలు చేశారా? ద్రోహం చేశారా? పవన్‌ టెంపరరీ పార్టనర్‌కు కూడా చెబుతున్నాం. బీజేపీ 7 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి మేలు చేసిందా? ద్రోహం చేసిందా?. అసలు ఏం ఒరగబెట్టింది?. వీటన్నింటికి సమాధానం చెబుతూ తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటారా?. అలాగే రాష్ట్రానికి మేలు చేసింది కాబట్టి, బీజేపీకి ఓటు వేయాలని పవన్‌ కళ్యాణ్‌ అడుగుతున్నారా?. అందుకు ఆయన కూడా ఈ ఎన్నికను ఒక రెఫరెండంగా తీసుకుంటారా?’.
 
‘మీరు దీన్ని స్వీకరించినా లేకపోయినా, మేము మాత్రం మా 22 నెలల పాలనకు తిరుపతి ఉప ఎన్నికను ఒక రెఫరెండంగా చెబుతున్నాం. తిరుపతికి ఎన్నికల ప్రచారానికి రావడం లేదని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు. అందుకే లేఖ రాశారు. కాబట్టి ప్రజలు కూడా రెఫరెండంగా భావిస్తే, మా పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి, సీఎంకు బహుమతిగా ఇవ్వండి’.. అంటూ మంత్రి శ్రీ పేర్ని నాని ప్రెస్‌మీట్‌ ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరంగల్: రెండు సార్లు టీకా వేసుకున్నా వదిలిపెట్టని కరోనావైరస్, ఎంతమందిని పట్టుకుందో తెలుసా?