Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్: 'రెమెడెసివీర్ మందుల కోసం బ్లాక్ మార్కెట్ వైపు చూడాల్సి వస్తోంది'

కరోనావైరస్: 'రెమెడెసివీర్ మందుల కోసం బ్లాక్ మార్కెట్ వైపు చూడాల్సి వస్తోంది'
, శనివారం, 17 ఏప్రియల్ 2021 (18:55 IST)
దిల్లీలో ఉంటున్న అఖిలేశ్ మిశ్రాకు గురువారం చిన్నగా జ్వరం, దగ్గు మొదలయ్యాయి. మామూలు జ్వరం అనుకున్నారు. కానీ మర్నాడు వాళ్ల నాన్న యోగేంద్రకు కూడా అవే లక్షణాలు కనిపించడంతో కోవిడ్ సోకిందనే అనుమానం వచ్చింది. ఇద్దరూ ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకుందామని చూస్తే మూడు రోజుల వరకూ స్లాట్ దొరకలేదు. చివరకు ఆదివారం వాళ్లకు స్లాట్ దొరికింది. అయితే ఈలోపు యోగేంద్రకు జ్వరం ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చేరమని డాక్టర్ సలహా ఇచ్చారు.

 
కానీ ఆస్పత్రుల్లో పడకలు దొరకడం కష్టంగా ఉంది. దిల్లీ, నోయిడాల్లోని ఎన్నో ఆస్పత్రులను సంప్రదించినా వాళ్లకి బెడ్ దొరకలేదు. చివరకు దిల్లీలోని ఒక ఆస్పత్రిలో చేరగలిగారు. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు. "ఆయనకు వైద్యం అందకుండానే పోతారేమోనని చాలా భయపడ్డాను. ఏ కుమారుడికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. కళ్ల ముందే కన్నతండ్రి రోగంతో బాధపడుతుంటే, వైద్యం చేయించలేకపోవడం దౌర్భాగ్యం. ఆ పరిస్థితి చాలా విచారకరం. అందరికీ వైద్య సదుపాయాలు సమానంగా అందాలి" అని అఖిలేశ్ అన్నారు.

 
ఇది వీరి కుటుంబానికి ఎదురైన సమస్య మాత్రమే కాదు. వీరిలాగే దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆస్పత్రుల్లో పడకలు దొరకక, అవసరమైన మందులు, ఆక్సిజన్ దొరకక అల్లాడిపోతున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శ్మశానవాటికల ముందు పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. కరోనా సోకిందో లేదా తెలుసుకోవడానికే రెండు, మూడు రోజులు పడుతోంది. టెస్ట్ తరువాత మరో రెండు మూడు రోజులకు ఫలితాలు తెలుస్తున్నాయి. "నాకు ఇప్పటికే మూడు రోజుల నుంచి కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. టెస్ట్ చేయించుకోవడం కోసం మరో రెండు రోజులు ఆగాలనే ఆలోచనే భయం కలిగిస్తోంది" అని నోయిడాలో టెస్ట్ కోసం ల్యాబ్ బయట నిరీక్షిస్తున్న ఒక 35 ఏళ్ల వ్యక్తి చెప్పారు.

 
బ్లాక్ మార్కెట్ జోరు
ఇటీవల కాలంలో రెమెడిసివీర్, టోసిలిజుమాబ్ మందులు కావాలని అభ్యరిస్తూ అనేకమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చూస్తూ ఉన్నాం. ఈ మందులు చూపే ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక చర్చలు జరుగుతున్నప్పటికీ భారతదేశంతో సహా మరికొన్ని దేశాల్లో ఈ ఔషధాల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చారు. యాంటీవైరల్ ఔషధం రెమెడిసివీర్ వాడమని ఇండియాలో చాలామంది డాక్టర్లు సూచిస్తున్నారు. దాంతో ఈ మందులకు డిమాండ్ బాగా పెరిగింది.

 
భారతదేశంలో వీటి ఎగుమతులను నిషేధించినప్పటికీ, డిమాండ్‌కు సరిపడా మందులు ఉత్పత్తి చేయడం సాధ్యం కావట్లేదు. గత మూడు వారాలుగా ఇండియాలో రోజుకు 1,50,000 కన్నా ఎక్కువ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెమెడిసివీర్ ఉత్పత్తిని భారీగా పెంచనున్నట్లు హెటెరో ఫార్మా సంస్థ తెలిపింది.

 
మార్కెట్లో ఈ ఔషధాల కొరత ఎక్కువగా ఉండడంతో దిల్లీతో సహా పలు నగరాల్లో బ్లాక్ మార్కెట్ హవా జోరందుకున్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది. దిల్లీలో బీబీసీ సంప్రదించిన ఏజెంట్లలో కనీసం ముగ్గురు.. రెమెడిసివీర్ 100 మి.గ్రా సీసా రూ.24,000లకు అమ్మడానికి సిద్ధపడ్డారు. ఇది మార్కెట్లో దొరికే ధరకన్నా చాలా ఎక్కువ. భారత ఆరోగ్య శాఖ సూచనల ప్రకారం.. ఒక రోగికి 100 మి.గ్రా రెమెడిసివీర్ ఆరు డోసులు అవసరమవుతాయి. కొన్ని కేసుల్లో ఎనిమిది డోసులు తీసుకోవాల్సి వస్తుందని డాక్టర్లు అంటున్నారు.

 
ఈ మందును బ్లాక్ మార్కెట్లో ఆరు నుంచి ఎనిమిది డోసులు కొనుక్కోవాలంటే మధ్యతరగతి వారికి తలకు మించిన భారమే అవుతుంది. ఈ మందు కొనుక్కోవడానికి చాలా ఖర్చు చేయాల్సి వచ్చిందని అతుల్ గార్గ్ తెలిపారు. అతుల్ తల్లిని దిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. "ఈ మందు కోసం వందలకొద్దీ కాల్స్ చేయాల్సి వచ్చింది. దొరుకుతుందో లేదో అని ఒకటే టెన్షన్. చాలా సమయం ఆందోళనతో వేచి చూడాల్సి వచ్చింది" అని అతుల్ తెలిపారు.

 
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఫార్మా కంపెనీలు రెమెడెసివీర్ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. టోసిలిజుమాబ్ మందును సాధారణంగా కీళ్లనొప్పులకు వాడతారు. అయితే, కోవిడ్ సమయంలో ఇది ప్రాణాలను కాపాడే మందుగా క్లినికల్ ట్రయిల్స్‌లో తేలింది. కాగా, ప్రస్తుతం ఇది మార్కెట్లోంచి పూర్తిగా మాయమైపోయింది. ఎక్కడా దొరకట్లేదు.

 
"నా ఫోన్ 24 గంటలూ మోగుతూనే ఉంటోంది. మందులు కావాలని ఫోన్లు వస్తూనే ఉన్నాయి. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మా ఇంట్లో వాళ్లకే నేను మందులు సంపాదించలేకపోతున్నాను. ఈ మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కానీ ఈ పరిస్థితికి వ్యవస్థలోని లోపాలే కారణం అని ఒప్పుకుంటున్నా" అని ఆల్ ఇండియా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘల్ తెలిపారు.

 
ఆక్సిజన్ సరఫరా, ఎక్స్-రేలు, కోవిడ్ టెస్టులు
ఇండియాలో పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. అనేక ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ సరఫరా చేయలేక రోగులను చేర్చుకోవడం లేదు. ఆక్సిజన్ సిలిండర్లను విమానాల్లో పంపించమని, రోడ్డు రవాణా ద్వారా వస్తే ఆలస్యమవుతుందని ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. చిన్న చిన్న ఊర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆస్పత్రుల్లో పడకలు లభించకపోతే ఇంటి దగ్గరే ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

 
"మా నాన్నకు ఆస్పత్రిలో బెడ్ దొరకలేదు. ఇంటి దగ్గరే ఆక్సిజన్ సిలిండర్ పెట్టేందుకు ప్రయత్నించాం. సిలిండర్ కోసం సమీపంలోని పట్టణానికి వెళ్లడానికి మేము రానుపోను 8 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. మా నాన్నకు ఊపిరి అందడం కష్టమైపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్ కోసం నేను ఎనిమిది గంటలు ప్రయాణం చేయాల్సిన దుస్థితి కలిగింది" అని ఉత్తర భారతదేశానికి చెందిన నబీల్ అహ్మద్ తెలిపారు.

 
చిన్న ఊర్లల్లో రోగులు ఎదుర్కొంటున్న మరొక పెద్ద సమస్య ఏమిటంటే.. ప్రైవేట్ ల్యాబుల్లో ఎక్స్-రే, సీటీ స్కాన్ చేయడానికి నిరాకరిస్తున్నారు. కోవిడ్ రోగులకు ఈ పరీక్షలు తప్పక చేయించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎక్స్-రే కావాలంటే ఆస్పత్రిలో చేరాలి లేదా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్ష చేయించుకోవాలి. కానీ అక్కడ పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయని అలహాబాద్‌కు చెందిన యోగేష్ అంటున్నారు. "రోగులు ఒక ఎక్స్-రే తీయించుకోలేకపోవడం నమ్మశక్యం కాకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, కొన్నిసార్లు మేం రక్త పరీక్షల ఫలితాల పైనే ఆధారపడి చికిత్స అందించాల్సి వస్తోంది" అని అలహాబాద్‌కు చెందిన ఒక డాక్టర్ తెలిపారు.

 
శ్మశానవాటికల ముందు పొడవాటి లైన్లు
కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో శ్మశానవాటికల్లో పగలు, రాత్రి లేకుండా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలను దహనం చేయడానికి కొన్ని గంటలపాటూ నిరీక్షించాల్సి వస్తోంది. సూరత్‌లోని ఒక శ్మశానవాటికలో నిర్విరామంగా దహనాలు చేయడంతో కొలిమిలోని లోహం కరిగిపోతోందని ఒక నివేదికలో పేర్కొన్నారు.

 
లక్నోలోని శ్మశానంలో అర్థరాత్రి కూడా కట్టెలు మండుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్మశానవాటికల్లో పని చేస్తున్నవాళ్లు అలిసిపోతున్నారు. విశ్రాంతి అనేదే లేకుండా పని చేస్తున్నారు. దేశంలో పరిస్థితి ఎందుకింత దిగజారిపోయింది? ఈ స్థితికి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకొని ఉండవచ్చా అనే చర్చలు జరుగుతున్నాయి.

 
"కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి మనం ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. సెకండ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఆక్సిజన్ సిలిండర్ల కొరత, మందుల కొరత, ఆస్పత్రుల్లో పడకలు లేకపోవడం.. ఇలాంటి దురదృష్టకర పరిస్థితులను నివారించడానికి ఏ రకమైన ముందస్తు ప్రణాళికలు చేయలేదు" అని ఎపిడమాలజిస్ట్ లలిత్ కాంత్ అన్నారు. "ఇతర దేశాల నుంచి కూడా మనం ఎలాంటి పాఠాలను నేర్చుకోలేదు" అని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాకు మేమే లాక్డౌన్ విధించుకుంటాం.. ఏపీలో వర్తక సంఘాల నిర్ణయం