అమరావతిలోని ప్రజావేదికలో ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సామాగ్రిని ప్రభుత్వ అధికారులు బయటపడేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు వస్తువులను ఆరుబయట పడేయడం ఏమాత్రం భావ్యం కాదని టీడీపీ నేతలు అంటున్నారు.
నిజానికి ప్రజలను కలుసుకునేందుకు వీలుగా గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఈ ప్రజావేదికను నిర్మించారు. ఇది చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఉంది. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. దీంతో ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు.
అయితే, ఈ ప్రజా వేదికను తమకు కేటాయించాలంటూ కొన్ని రోజుల క్రితం కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విపక్ష నేత హోదాలో ఓ లేఖ రాశారు. దానిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో ఈనె 24వ తేదీన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్ల సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సును తొలుత అసెంబ్లీలోని ఐదో అంతస్తులో నిర్వహించాలని భావించారు. కానీ, శుక్రవారం ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుని, కలెక్టర్ల సదస్సును ప్రజావేదికలో నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు... ప్రజావేదికను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తిగత సామాగ్రితో పాటు.. తెలుగుదేశం పార్టీకి చెందిన కొన్ని వస్తువులు ఉన్నాయి. వీటిని తీసుకెళ్లాలని టీడీపీకి సమాచారం ఇవ్వకుండానే, ఆ సమాగ్రిని ఆరుబయటపడేశారు. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.
కనీసం తమకు సమాచారం ఇచ్చివున్నట్టయితే, చంద్రబాబు వ్యక్తిగత సామాగ్రిని తీసకెళ్లేవారిమని, అలాంటి సమాచారమేదీ ఇవ్వకుండా 40 యేళ్ల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత సామాగ్రిని బయటపడేయడం భావ్యం కాదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అంటున్నారు. మొత్తంమీద ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై టీడీపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.