Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను జైలులో లేను.. మీ అందరి గుండెల్లో ఉన్నాను.. : జైలు నుంచి చంద్రబాబు లేఖ

chandrababu
, ఆదివారం, 22 అక్టోబరు 2023 (17:31 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి జైల్లో ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. తాను జైలులో లేనని, మీ అందరి గుండెల్లో ఉన్నట్టు చెప్పారు. ఇదే విషయంపై ఆయన రాసిన సుధీర్ఘ లేఖ వివరాలను పరిశీలిస్తే, 
 
నా ప్రియాతి ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు....
 
"నేను జైలులో లేను. మీ అందరి గుండెల్లో ఉన్నాను. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నాను. విధ్వంస పాలనని అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నాను. ప్రజలే నా కుటుంబం. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజాజీవితం నా కళ్ల ముందు కదలాడుతోంది. నా రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా సాగింది. దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యం.
 
ఓటమి భయంతో నన్ను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకి దూరం చేశామనుకుంటున్నారు. నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు. కానీ అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంటాను. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి నేను గుర్తుకొస్తూనే ఉంటాను. ప్రజల్నించి ఒక్క రోజు కాదు కదా!, ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరు. కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు కానీ.. నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతని ఎన్నడూ చెరిపేయలేరు. 
 
ఈ చీకట్లు తాత్కాలికమే. సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలుగోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచలు నన్ను ప్రజల్నించి దూరం చేయలేవు. నేను తప్పు చేయను, చేయనివ్వను. ఈ దసరాకి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించాను. అదే రాజమహేంద్రవరం జైలులో నన్ను ఖైదు చేశారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తాను. నా ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను.
 
ఎప్పుడూ బయటకురాని స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి బిడ్డ, నా భార్య భువనేశ్వరిని నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరపున పోరాడాలని నేను కోరాను. ఆమె అంగీకరించింది. నా అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలని పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టడానికి 'నిజం గెలవాలి' అంటూ మీ ముందుకు వస్తోంది.
 
జనమే నా బలం, జనమే నా ధైర్యం. దేశ విదేశాలలో నా కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. నా క్షేమం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయి. న్యాయం ఆలస్యం అవ్వొచ్చునేమో కానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమే. మీ అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటకి వస్తాను. అంతవరకూ నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించండి. చెడు గెలిచినా నిలవదు, మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాలపరీక్షలో గెలిచి తీరుతుంది. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది.
 
అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో..
మీ ...
నారా చంద్రబాబు నాయుుడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు విడుదల కావాలని దుర్గమ్మను వేడుకున్నా : కె.అచ్చెన్నాయుడు