Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివేకా లేఖకు నిన్ హైడ్రిన్ టెస్టుకు సీబీఐ కోర్టు అనుమతి.. వద్దంటున్న నిందితులు

viveka - cbi
, గురువారం, 8 జూన్ 2023 (13:25 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివికానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ మరో ముందడుగు వేసింది. వివేకాను హత్య చేయడానికి ముందు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలు కలిసి హత్యను వివేకా డ్రైవర్‌పైకి నెట్టేసేందుకు బలవంతంగా వివేకాతో లేఖ రాయించినట్టు సమాచారం. ఈ లేఖను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించారు. ఇపుడు ఈ లేఖ ఎవరు రాశారన్న విషయాన్ని నిర్ధారణ చేసుకునేందుకు నిన్ హైడ్రిన్ పరీక్ష చేయడానికి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.
 
సదరు లేఖను ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ పరీక్షకు పంపేందుకు సీబీఐకి అనుమతిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. వివేకా రాసిన అసలు లేఖను కోర్టుకు సమర్పించి.. తగినన్ని సర్టిఫైడ్ కాపీలు తీసుకుని.. అసలు లేఖను పరీక్షకు పంపాలని దర్యాప్తు సంస్థకు సూచించింది. నిన్ హైడ్రిన్ పరీక్ష సందర్భంగా ఒకవేళ అసలు లేఖపై ఉన్న రాత, ఇంకు దెబ్బతింటే.. సర్టిఫైడ్ కాపీలను ఆధారంగా సమర్పించవచ్చని పేర్కొంది. వివేకా హత్య జరిగిన తర్వాత మొదట అక్కడకు చేరుకున్న ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డికి సదరు లేఖ దొరికింది. 
 
వివేకా కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు సదరు లేఖను కృష్ణారెడ్డి దాచిపెట్టారు. లేఖను సాయంత్రం పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. అనంతరం ఆ లేఖను కడప కోర్టు నుంచి సీబీఐ స్వీకరించి.. హైదరాబాద్, ఢిల్లీ సీఎఫ్ఎస్ఏలకు పంపించింది. లేఖపై ఉన్న రాతను ఇతర పత్రాలతో పోల్చిన నిపుణులు.. సదరు రాత వివేకాదేనని తేల్చారు. తీవ్రమైన ఒత్తిడిలో రాశారని.. ఆయన సొంత ఆలోచనలు కాకుండా వేరే వాళ్లు చెప్పినవి రాసినట్లుగా ఉందని సీఎఫ్ఎస్ఎల్ పరీక్షలో తేలింది. 
 
అప్రూవర్ దస్తగిరి స్టేట్మెంట్‌లో సీఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు సరిపోలాయి. దీని తర్వాత 2021 నవంబరులో సదరు లేఖపై ఉన్న వేలిముద్రలను గుర్తించాలని సీబీఐ ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్‌కు లేఖ రాసింది. నిన్ హైడ్రిన్ టెక్నిక్ ద్వారా పరీక్ష చేస్తే లేఖలో ఉన్న రాత, ఇంకు చెదిరిపోయే ప్రమాదం ఉందని అటు నుంచి సమాధానం వచ్చింది. దీంతో నిన్ హైడ్రిన్ పరీక్షకు కోర్టు అనుమతి కోరుతూ అప్లికేషన్ దాఖలు చేసింది. దీనిని సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
సదరు లేఖపై అనేక మంది ఫింగర్ ప్రింట్స్ ఉంటాయని.. టెస్ట్ చేయడం వ్యర్థమని పేర్కొంది. నిందితుల వాదనను తోసిపుచ్చిన సీబీఐ కోర్టు.. ఆధునిక కాలంలో దర్యాప్తునకు శాస్త్రీయ ఆధారాలు కీలకమని పేర్కొంది. నిన్ హైడ్రిన్ వంటి సృజనాత్మక పద్ధతులను తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. వేలిముద్రలను గుర్తించడానికి అనేక పద్ధతులు ఉన్నప్పటికీ.. నిన్ హైడ్రిన్ చాలా ఉపయోగకరమైందని సీబీఐ కోర్టు న్యాయమూర్తి సీహెచ్ రమేశ్ బాబు తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
 
నిన్ హైడ్రిన్ అనేది ఒక రసాయనిక పౌడర్. దాని ఫార్ములా సీతి, హెచ్ 6, వో4. దీన్ని ఇథనాల్లో వేసినప్పుడు కరిగిపోతుంది. నిన్ హైడ్రిన్ పౌడర్‌ను రసాయనిక ద్రావణంగా మార్చి వివేకా రాసిన లేఖపై స్ప్రే చేస్తారు. లేదా ఆ రసాయనంలో లేఖను ముంచి బయటకు తీస్తారు. ఆ తర్వాత 80 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో దాన్ని వేడిచేస్తారు. దాన్ని బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు తీసుకొస్తారు. పది నిమిషాల తర్వాత ఆ లేఖపై ఎక్కడెక్కడ వేలి ముద్రలు ఉన్నాయో ఆ ప్రాంతం నీలం ఉదారంగు (వంగపండు కలర్)లోకి మారుతుంది. అప్పుడు వేలిముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ వేలిముద్రలు ఎవరివో విచారణలో సీబీఐ తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్టోబరు లేదా నవంబరు నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు