Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివేకా హత్య కేసు : మిస్టరీ వీడినట్టేనా.. హంతకులు వారిద్దరేనా?

Advertiesment
CBI Arrest
, శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (08:54 IST)
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని చిక్కుముడుల్లో ఒక్కోముడి వీడుతూ వస్తోంది. ఈ హత్య కోసం ఉపయోగించిన గొడ్డలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేసమయంలో ఈ హత్య కేసులోని ప్రధాన సూత్రధారులుగా ఇద్దరిని అనుమానిస్తున్నారు. వారిలో ఒకరిని సీబీఐ అరెస్టు చేసింది. 
 
ఆ కీలక అనుమానితుడి పేరు ఉమాశంకర్‌ రెడ్డి. సింహాద్రిపురం మండలం కుంచేకులకు చెందిన ఉమాశంకర్‌ను ఉదయం నుంచి విచారించిన అధికారులు సాయంత్రం ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం పులివెందుల కోర్టులో ప్రవేశపెట్టి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. వివేకానందరెడ్డి పొలం పనులు చూసే జగదీశ్వర్‌ రెడ్డి సోదరుడే ఉమాశంకర్‌ రెడ్డి. 
 
వివేకానంద రెడ్డి హత్యకేసులో ఉమాశంకర్, సునీల్ యాదవ్ పాత్ర ఉందనడానికి ఆధారాలు ఉన్నాయని పులివెందుల కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది. వివేకా హత్య కేసులో ఉమాశంకర్ పాత్ర ఉన్నట్టు సునీల్, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి తమ వాంగ్మూలాల్లో చెప్పారని తెలిపింది. వివేకాను హత్య చేయడానికి ముందు వీరిద్దరూ కలిసి ఆయన ఇంట్లోని శునకాన్ని కారుతో ఢీకొట్టి చంపారని పేర్కొన్నారు.
 
వివేకాను హత్య చేసేందుకు వీరిద్దరూ కలిసి బైక్‌పై వెళ్లారని, హత్య తర్వాత ఉమాశంకర్‌ బైక్‌లో గొడ్డలి పెట్టుకుని పారిపోయాడని సీబీఐ అందులో వివరించింది. బైక్‌ను, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. 
 
గుజరాత్ నుంచి ఫోరెన్సిక్ నివేదికను కూడా తెప్పించామన్న సీబీఐ గత నెల 11న ఉమాశంకర్ ఇంటి నుంచి రెండు చొక్కాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఇంకా మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పేర్కొంది. 
 
అందువల్ల ఉమాశంకర్‌ను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ ఆ పిటిషన్‌లో అభ్యర్థించింది. కాగా, ఉమాశంకర్‌కు కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించడంతో పులివెందుల నుంచి కడప జిల్లా జైలుకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమకు నిరాకరించిందనీ యువతి గొంతు కోసం యువకుడు.. ఎక్కడ?