Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుల, మతపరమైన దూషణలు చేయలేదు.. నన్నపనేని రాజకుమారి

Advertiesment
కుల, మతపరమైన దూషణలు చేయలేదు.. నన్నపనేని రాజకుమారి
, గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:58 IST)
రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నంతకాలం, రాష్ట్రంలోని ఆడబిడ్డలందరి యోగక్షేమాల గురించే ఆలోచించానని, ఎక్కడ ఏ ఆడబిడ్డకు కష్టమొచ్చిందని తెలిసినా పరుగున వెళ్లి సహాయ సహకారాలందించిన సందర్భాలు అనేకం ఉన్నాయని రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌, టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు.

గురువారం ఆమె మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితతో కలిసి గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 3 ఏళ్ల 7నెలలపాటు మహిళా కమిషన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో పేద, మధ్యతరగతి మహిళల ఆనందం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో  పనిచేయడం జరిగిందన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా, తెలుగుదేశం పార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమానుష చర్యలకు పాల్పడిందన్న ఆమె, తనను అరెస్ట్‌ చేసి మూడు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పారన్నారు.

తనతో పాటు మరికొందరు మహిళా నేతలను అరెస్ట్‌ చేసే క్రమంలో పోలీసులు తమపట్ల దురుసుగా ప్రవర్తించారని, ఒక పాత వాహనాన్ని తీసుకొచ్చి బలవంతంగా దానిలోకి ఎక్కించే ప్రయత్నం చేశారని రాజకుమారి చెప్పారు.

ఆ వాహనం దుమ్ము, ధూళితో ఉన్నందున ఆ సమయంలో తమతో ఉన్న మహిళా నేత ఈ వాహనంలోని పరిస్థితిని వివరిస్తూ ''ఏంటమ్మా ఈ బండి ఇలా ఉంది... దరిద్రంగా..'' అని వ్యాఖ్యానించడం జరిగిందన్నారు. ఆ సమయంలో ఆ వాహనం వెనుకనే ఉన్న మహిళా ఎస్సై ఎవరిని దరిద్రం అంటున్నారంటూ, మాపై కోపం ప్రదర్శిస్తూ, అసందర్భ వ్యాఖ్యానంతో, పరుష పదజాలం వాడిందని నన్నపనేని వివరించారు.

పోలీస్‌జీప్‌లో ఉన్న మేమందరం, మా మానాన మేము ఏదో మాట్లాడుకుంటుంటే, ఆ మాటలను తనకు ఆపాదించుకొని సదరు మహిళా ఎస్సై ఎందుకలా వ్యవహరించిందో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని రాజకుమారి వాపోయారు.

ఆమె మాట్లాడుతుండగానే మేము ఉన్న వాహనం ముందుకు వెళ్లిపోయిందని,  చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాకగానీ మహిళాఎస్సైని రాజకుమారి, ఇతర టీడీపీ మహిళానేతలు దూషించారంటూ, మాపై  ప్రసారమాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని గమనించలేకపోయామన్నారు.

23ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చిన తాను, ఆనాటి నుంచి వివిధ సేవాసంఘాల్లో పనిచేస్తూ ప్రజలకు, మహిళలకు సామాజికసేవ చేశానే తప్ప, ఎవరినీ ఎప్పుడూ ఎక్కడా దూషించడం, దుర్భాషలాడటం జరగలేదని రాజకుమారి గద్గదస్వరంతో తెలిపారు.

గుర్రం జాషువా గారి కుమార్తె హేమలతా లవణం స్ఫూర్తితో సాదాసీదాగా, ఏ విధమైన ఆభరణాలు, అలంకారాలు లేకుండా జీవించడం నేర్చుకున్నట్లు నన్నపనేని చెప్పారు. తన రాజకీయ, వృత్తిగత జీవితంలో, తన ఎదుగుదలకు, తనలోని సామాజికవికాసానికి ఎంతోమంది బడుగు, బలహీన వర్గాల వారే స్ఫూర్తి నింపారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

నిన్న జరిగిన సంఘటనలో ఎక్కడా, తాను మహిళా ఎస్సైని ఉద్దేశించి కులం పేరుతో దూషించలేదని, అసలు ఇన్నేళ్ల తన రాజకీయ , వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ, ఎక్కడా కూడా అలాంటి దురంతాలు జరిగిన దాఖలాలు లేవని రాజకుమారి పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సరైన సహాకారం అందించడం లేదని, తాను తన పదవికి రాజీనామా చేయడం జరిగిందన్నారు.

తాను నోరుపారేసుకున్నానని, మహిళా ఎస్సైని కులం పేరుతో దూషించానని చెబుతున్న వారందరూ తగిన ఆధారాలుంటే  చూపాలని, అలాకాకుండా ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తే సదరు వ్యక్తులు, సంస్థలపై పరువునష్టం దావా వేస్తానని నన్నపనేని హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ తలపెట్టిన కార్యక్రమం విజయవంతమవడంతో ఏం చేయాలో పాలుపోని కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు కావాలనే ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితాన్ని వివాదాల్లోకి లాగేలా ఏ మీడియా సంస్థలు తనపై ప్రచారం చేయవద్దని ఆమె విజ్ఞప్తిచేశారు.
 
ఎస్సై ఎందుకలా ప్రవర్తించిందో?: మాజీ ఎమ్మెల్యే అనిత
తనను అరెస్ట్‌ చేసిన అరగంట తర్వాత రాజకుమారిని, ఇతర మహిళా నేతలను అరెస్ట్‌ చేసి ముందు మంగళగిరి స్టేషన్‌కు తరలించారని, అదే వాహనంలో మాతోపాటు మాజీ మంత్రి జవహర్ కూడా ఉన్నారని, తామందరం దాదాపు అరగంటకు పైగా మంగళగిరి పీఎస్‌లోనే ఉన్నామని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తెలిపారు.

నిజంగా రాజకుమారి ఆ ఎస్సైని కులం పేరుతో దూషించి ఉంటే, వాహనంలోఉన్న మమ్మల్నందరినీ అంత మర్యాదగా మంగళగిరి స్టేషన్‌కు ఎందుకు తరలిస్తారని అనిత ప్రశ్నించారు. సదరు మహిళా ఎస్సై ఏ సందర్భంలో, ఎందులా ప్రవర్తించిందో ఆమెకే తెలియాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛలో ఆత్మకూరు'తో ప్రభుత్వ తీరుని ఎండ‌గ‌ట్టాం...మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు