Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛలో ఆత్మకూరు'తో ప్రభుత్వ తీరుని ఎండ‌గ‌ట్టాం...మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు

webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:56 IST)
జాతీయస్థాయి ఛానళ్లు కూడా పల్నాడులోని ఆత్మకూరు వెళ్లి, అక్కడ జరిగిన దాడులు, దారుణాలను ప్రసారం చేస్తే, బొత్స సత్యనారాయణ వంటి వారు, అక్కడేమీ లేనట్లుగా, ఛలో ఆత్మకూరు కార్యక్రమం తెలుగుదేశం సొంత కార్యక్రమమంటూ చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశవైఖరిని, అహంకారపూరిత పాలనను తెలియచేస్తోందని టీడీపీ సీనియర్‌నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ బాధితులకోసం తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరం పోలీసు బలగాల సాయంతో ప్రభుత్వం ఖాళీ చేయించిందని, మొత్తానికి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, ఇతరవర్గాలపై జరుగుతున్న దాడుల గురించి జాతీయస్థాయిలో తెలిసేలా చేయడంలో టీడీపీ విజయం సాధించిందని నక్కా ఆనంద్‌బాబు స్పష్టం చేశారు.

కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో దేశంలో ఎక్కడాలేని విధంగా అరాచకాలకు, హత్యా రాజకీయాలకు పాల్పడిందని, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో  వందలాది కుటుంబాలు ఊళ్లను, పొలాలను వదిలి వచ్చే పరిస్థితి కల్పించింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశానికి ఓటేశారనే అక్కసుతోనే చాలా గ్రామాల్లో సదరు కుటుంబాలపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయన్నారు.

చాపకింద నీరులా రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల తరహా ఫ్యాక్షన్‌ సంస్కృతి పెచ్చుమీరుతున్న వేళ, దారుణాలు జరుగుతుంటే బొత్స లాంటి వ్యక్తులు వాటిని చిన్న చిన్న సంఘటనలుగా పేర్కొనడం బాధాకరమని నక్కా వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్‌లో ఉండి, జగన్మోహన్‌రెడ్డి నేరచరిత్ర, రాజకీయ జీవితం గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన బొత్స, నేడు తన పదవిని కాపాడుకోవడం కోసం  వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలను, దుర్మార్గాలను చిన్నవిగా చేసి చూపాలనుకోవడం ఆయనలోని  నీచత్వానికి నిదర్శనమని ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తామేం చేస్తున్నామనేది ఆలోచించకుండా, ప్రతి అంశంలోకి గత ప్రభుతాన్ని లాగుతూ రాజకీయాలు చేయడం రాష్ట్ర సర్కారుకి, బొత్సలాంటి మంత్రులకు ఫ్యాషన్‌గా మారిందని టీడీపీనేత మండిపడ్డారు. గత ప్రభుత్వంపై నిందలేయడం మాని, ఇప్పుడు తామేం చేస్తున్నామో వైసీపీ కేబినెట్‌ తెలుసుకోవాలని ఆనంద్‌బాబు హితవు పలికారు.

తెలుగుదేశం పార్టీ శిబిరంలో ఉన్నవారంతా పెయిడ్‌ ఆర్టిస్ట్‌లని సంబోధించిన మంత్రులు, 144 సెక్షన్‌పెట్టిమరీ, వారందరినీ నిన్నటికి నిన్న పోలీసుల సాయంతో ఎక్కడికి తరలించారని నక్కా నిలదీశారు. 164 మంది బాధితులకోసం ప్రత్యేక వాహనాలు సిద్ధం చేసి మరీ, ఆఘమేఘాల మీద వారిని ఎక్కడికి తీసుకెళ్లారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెయిడ్‌శిబిరాలకు తరలించారా అని ఆనంద్‌ బాబు ఎద్దేవా చేశారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రులే బరితెగించి మాట్లాడుతూ నిజమైన పెయిడ్‌ ఆర్టిస్ట్‌లని తలదన్నుతున్నారని, చట్టాల అమలు గురించి, వెనకాముందు ఆలోచించకుండా వారి ఆదేశాలను గుడ్డిగా అమలు చేస్తున్న అధికారులు అంతకన్నా గొప్ప పెయిడ్‌ఆర్టిస్ట్‌లని నక్కా మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ