63వ రోజుకు రాజధాని రైతుల ఆందోళనలు

మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (09:14 IST)
రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఆందోళనలు 63వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది.

వెలగపూడిలో 63వ రోజుకు రిలే దీక్షలు చేరుకున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు మందడం, వెలగపూడిలోనూ రైతులు 24 గంటల పాటు దీక్షకు కూర్చోనున్నారు.

మరోవైపు ఈరోజు రాజధాని గ్రామాలను జాతీయ రైతు నాయకులు సందర్శించనున్నారు. కాగా రెండు నెలలకు పైగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని పలువురు టీడీపీ నేతలు ఈ సందర్భంగా విమర్శించారు.
 
మోదీ, అమిత్‌ షా ఏం హామీ ఇచ్చారు?: సీపీఐ
సీఎం జగన్‌ ఈ నెల 12, 14 తేదీల్లో ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసి ఏం చర్చించారో బయటపెట్టాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

సమాచార చట్టం ద్వారా ఆయన  కోరారు. రాష్ట్రానికి సంబంధించి జగన్‌ ఏం విజ్ఞాపనలు ఇచ్చారు? అని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌ షా ఏం హామీ ఇచ్చారో తెలపాలన్నారు. 
 
వైసీపీ వన్‌సైడ్‌ లవ్‌: కాంగ్రెస్
బీజేపీని వైసీపీ వన్‌సైడ్‌ లవ్‌ చేస్తోందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు కోసం వైసీపీ తహతహలాడుతోందని ఆరోపించారు.

కేంద్రం మెడలు వంచుతానన్న సీఎం జగన్‌ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. లోక్‌సభలో సీఏఏకు మద్దతు ఇచ్చిన వైసీపీ, రాష్ట్రంలో డ్రామాలు ఆడుతోందని తులసిరెడ్డి ధ్వజమెత్తారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు రామ్ గోపాల్ వర్మ..ఎందుకో తెలుసా?