ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖలో లెక్కలపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌంటర్ ఇచ్చారు. రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలున్నాయని స్పష్టం చేశారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారన్నారు. సీఎఫ్‌ఎంను ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమే అని తెలిపారు. ఆడిట్ సంస్థ ప్రశ్నల ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏమైనా సందేహాలుంటే మీటింగ్ పెట్టి క్లారిటీ తీసుకోవచ్చు అంటూ మంత్రి బుగ్గన సలహా ఇచ్చారు.
కాగా, రాష్ట్ర ఆర్థికశాఖ అస్తవ్యస్థ విధానాలపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఖజానా నుంచి రూ.41,043 కోట్లకు సంబంధించి ఖర్చుల వివరాలు లేవంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.