Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పశుపోషణతో రైతులకు మెరుగైన అదాయం: ఏపీ గవర్నర్

పశుపోషణతో రైతులకు మెరుగైన అదాయం: ఏపీ గవర్నర్
, శనివారం, 28 ఆగస్టు 2021 (13:03 IST)
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన అదాయాన్ని అందించటంలో పశు సంపద పాత్ర ఎంతో కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పశుపోషణ కీలక భూమికను పోషిస్తుందన్నారు. తిరుపతి వేదికగా శనివారం జరిగిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం 10వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో గవర్నర్ విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా హరిచందన్ మాట్లాడుతూ రైతులు అదనపు అదాయం కోసం వ్యవసాయ అనుబంధ రంగాలకు మరలుతున్నారని, హరిత విప్లవం, ఆర్థిక సరళీకరణ, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోవడం, కూలీల కొరత వంటి విబిన్న కారణాల వల్ల రైతులు పశుపోషణపై ప్రత్కేక దృష్టి నిలిపారన్నారు. భారతీయ వ్యవసాయంలో పశుపోషణ అంతర్భాగం కాగా,  గ్రామీణ జనాభాలో మూడింట రెండు వంతుల మంది జీవనోపాధికి పశు సంతతి కీలకంగా మారిందన్నారు.

ప‌శు వైద్యులు సాంకేతిక, ఆర్థిక, నైతిక మద్దతును పెంపకందారులకు అందించడం ద్వారా పశు పోషణను మరింత లాభదాయకంగా మార్చేందుకు మార్గనిర్దేశం చేయవలసి ఉందన్నారు.  పశువైద్యులు వృత్తిపరంగా, నైతికంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతుల జీవన ప్రమాణ స్దాయిని మెరుగుపరిచేందుకు కృషి చేయాలని గవర్నర్ కోరారు. 

కరోనా కారణంగా విద్యాభ్యాసం పలు మార్పులకు లోనవుతుండగా, డిజిటల్ క్లాస్ రూమ్ వ్యవస్ధ తెరపైకి వచ్చిందని, గరిష్ట సంఖ్యలో విద్యార్ధులు భాగస్వాములు అయ్యేలా ఈ వ్యవస్ధ రూపుదిద్దుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. జాతీయ విద్యా విధానం 2020తో దేశ విద్యావ్యవస్ధలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయని, హేతుబద్ధమైన ఆలోచన, ధైర్యం, స్థితిస్థాపకత, శాస్త్రీయ స్వభావం, సృజనాత్మక ఊహ, నైతిక విలువలు కీలకం కానున్నాయని ఇవి సమాజానికి మంచి పౌరులను అందిస్తాయన్న విశ్వాసం తనకుందని గవర్నర్ అన్నారు.

నేటి యువకులు దేశానికి మూల స్తంభాల వంటి వారని, వారికి మార్గం నిర్దేశించే విద్యాలయాలు నూతనత్వాన్ని సముపార్జించుకోవాలని పేర్కొన్నారు. విద్యా సంస్ధలలో వారు అలవరుచుకునే సమయపాలన, పరస్పర సహాయం, సహకారం,  క్రమశిక్షణ వారిని సంస్కారవంతులుగా,  చట్టానికి కట్టుబడి ఉండేలా తయారు చేస్తాయని హరిచందన్ అన్నారు.

సమాజాన్ని బలోపేతం చేయడంలో విద్యార్థులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని,  విద్యార్జన వారి ప్రాధమిక వృత్తి కాగా, తీరిక సమయాలలో సామాజిక సేవలో తమను తాము నిమగ్నం చేసుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విద్యార్ధులు తమ సామాజిక సేవలో భాగంగా గ్రామీణ, పట్టణ మురికివాడల అభివృద్ధి, మెడికో-సోషల్ సర్వేలు, మెడికల్ సెంటర్ల ఏర్పాటు, మాస్ ఇమ్యునైజేషన్, శానిటేషన్ డ్రైవ్‌, వయోజన విద్య వంటి అనేక అంశాలను చేపట్టాలన్నారు.

చివరి సంవత్సరం బివిఎస్ ఇ విద్యార్ధులు  తమ శిక్షణా కాలంలో రైతు భరోసా కేంద్రాల పనితీరును మూల్యాంకనం చేయటం ఆచరణీయమన్నారు. స్టార్టప్‌ల ఫైనాన్సింగ్‌, వ్యవస్థాపకత, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం "స్టార్ట్-అప్ ఇండియా" ప్రచారాన్ని ప్రారంభించిందని, విద్యార్ధులు అవకాశాలను అన్వేషించి పారిశ్రామికవేత్తలు కావాలని తద్వారా మరింత మందికి ఉద్యోగాలు కల్పించాలని సూచించారు. 

రాష్ట్రం 974 కిమీ తీర రేఖతో నీటి వనరులు, 1.74 లక్షల హెక్టార్ల ఉప్పునీటి సంభావ్యతతో భారతదేశంలో మత్స్య రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 14.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుండగా, మత్స్యశాఖ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేక మత్య్స శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ప్రకటించిందన్నారు. యువత సమాజానికి చేసే సేవల ద్వారా ఈ దేశం యొక్క గత వైభవాన్ని పునరుద్ధరించడానికి కృషి చేయాలన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు, రేపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు