ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంపై ఉన్న 'అసని' తీవ్ర తుపాను గంటకు 25 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. తదుపరి 48 గంటల్లో క్రమంగా సముద్రంలోనే తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
కాగా, బలహీనపడిన అనంతరం కాకినాడ, విశాఖపట్నం మధ్య కూడా తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో సోమవారం సముద్రంలో గంటకు 100 నుంచి 110 కి.మీ., గరిష్టంగా 120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి.
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. రాగల రెండ్రోజులపాటు కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పలుచోట్ల 12 నుంచి 20 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు వివరించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని తీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.