Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ సర్కారు వర్సెస్ ఎస్ఈసీ : స్థానిక సంస్థలను నిర్వహించలేం... సీఎస్‌కు రమేష్ లేఖ

జగన్ సర్కారు వర్సెస్ ఎస్ఈసీ : స్థానిక సంస్థలను నిర్వహించలేం... సీఎస్‌కు రమేష్ లేఖ
, మంగళవారం, 17 మార్చి 2020 (14:18 IST)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య లోకల్ వార్ సాగుతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ వాయిదా వేశారు. దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలను వాయిదావేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ గవర్నర్‌ హరిచందన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఎస్ఈసీ కూడా గవర్నర్‌ను కలిసి ఎన్నికలు వాయిదావేయడానికి గల కారణాలను వివరించారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ లేదని... ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలను నిర్వహించవచ్చని ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఈ లేఖకు రమేశ్ సమాధానం ఇచ్చారు. నీలం సాహ్ని రాసిన లేఖకు ఎస్ఈసీ రమేశ్ మూడు పేజీల పూర్తి స్థాయి వివరణతో లేఖ రాశారు. 
 
షెడ్యూల్ ప్రకారం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్లే ఎన్నికలను వాయిదా వేశామన్నారు. దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని... ఇప్పటికే పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేశారని గుర్తుచేశారు. అదేవిధంగా ఏపీలో కూడా వాయిదా వేశామని చెప్పారు.
 
ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావనే ఆరోపణలకు కూడా రమేశ్ వివరణ ఇచ్చారు. ఆర్థికశాఖలో పని చేసిన అనుభవం తనకు ఉందని... ఎన్నికలు ఆలస్యమైనా, ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత కూడా నిధులను తెచ్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రానికి నిధులను తెచ్చుకోవడానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపారు. ఎన్నికల వాయిదాకు ఎస్ఈసీ కట్టుబడి ఉందని... తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
 
కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ఉందని... ఇక్కడ ఎన్నికలను నిర్వహిస్తే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను, కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలను వాయిదా వేశారనీ, గోవాలో ఎన్నికల వాయిదా అంశాన్ని పరిశీలిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. అందువల్ల తమ నిర్ణయంో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు, ఎన్నికలను ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయాన్ని మాత్రం లేఖలో ఆయన పేర్కొనలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24 గంటల్లో 14 వేల కరోనా వైరస్‌ కేసులు : డబ్ల్యూహెచ్ఓ