Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ పల్లె పోరు : మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Advertiesment
ఆంధ్రప్రదేశ్ పల్లె పోరు : మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
, శుక్రవారం, 29 జనవరి 2021 (14:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమరం మొదలైంది. తొలి దశలో ఎన్నికల పోలింగ్ కోసం శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. తొలి దశలో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 3,249 గ్రామ పంచాయతీలకు, వాటి పరిధిలోని 32,504 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. 
 
ఈ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లను శుక్రవారం నుంచి దాఖలు చేయొచ్చు. సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేయాలని భావించే వారు శుక్రవారం నుంచి ఆదివారం (జనవరి 31) సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు వేసేందుకు ఎస్‌ఈసీ గడువు ఇచ్చింది. 
 
పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఫిబ్రవరి 4న అధికారులు ప్రకటిస్తారు. అప్పటి నుంచి 3 రోజులపాటు అంటే 7వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని వెల్లడించింది. 9న ఎన్నికలు నిర్వహించనున్నారు.
 
కాగా, నిజానికి 3,339 పంచాయతీల్లో మొదటి విడతలో ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ కారణాలతో 90 పంచాయతీల్లో ఎన్నికలను నిలిపివేసింది. 
 
అలాగే, 33,496 వార్డు సభ్యుల స్థానాలకు ఇచ్చిన నోటిఫికేషన్‌లో ప్రస్తుతం 992 వార్డులు తగ్గాయి. పెద్ద పంచాయతీల్లో రిటర్నింగ్‌ అధికారులను, మిగతా చోట్ల సహాయ రిటర్నింగ్‌, స్టేజి-1 అధికారులను కలెక్టర్లు నియమించగా వీరికి గురువారం శిక్షణ ఇచ్చారు. 
 
తొలి దఫాలో ఎన్నికలు జరిగే చోట్ల శుక్రవారం పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డుల్లో ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
 
వివిధ జిల్లాల కలెక్టర్ల విజ్ఞప్తులను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనరు (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్‌లో గురువారం కొన్ని మార్పులు చేశారు.
 
* విజయనగరం జిల్లాలో మొదటి దశలో ఎక్కడా ఎన్నికలు జరగవు. రెండో విడతలో పార్వతీపురం, మూడు, 4 దశల్లో విజయనగరం డివిజన్‌లో నిర్వహించనున్నారు.
 
* ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్‌లో మొదటి దశలో 20 మండలాల్లో నిర్వహించాల్సిన ఎన్నికలను 15కు కుదించారు. మిగిలిన ఐదు మండలాల్లోని పంచాయతీలను రెండో దశలో చేర్చారు.
 
* విశాఖపట్నం జిల్లాలో తొలి విడతలో 344 పంచాయతీల్లో ఎన్నికలు జరపాలని అధికారులు తొలుత ప్రతిపాదించారు. కోర్టు కేసుల కారణంగా నాలుగింటిని మినహాయించి.. 340కి పరిమితం చేశారు.
 
* పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్‌లోని గోపాలపురం మండలానికి మూడో దశకు బదులుగా రెండో దశలో ఫిబ్రవరి 13న ఎన్నికలు నిర్వహిస్తారు. ఏలూరు డివిజన్‌లో చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి.నరసాపురం మండలాల్లోని పంచాయతీలకు నాలుగో దశకు బదులుగా మూడో విడతలో ఫిబ్రవరి 17కు మార్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై వాసులకు ఓ గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి లోకల్‌ ట్రైన్లు