కృత్రిమ మేధ (ఏఐ)తో మానవాళికి ముప్పుకాదని, మానవత్వాన్ని తీర్చిదిద్దుతుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణం వేదికగా సీఐఐ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ జరుగుతోంది. ఇందులోభాగంగా 'ఏఐ-భవిష్యత్తులో ఉద్యోగాల అంశంపై నిర్వహించిన చర్చలో మంత్రి నారా లోకేశ్ పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి పారిశ్రామిక విప్లవం ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.
'ఏఐని అందిపుచ్చుకోవడానికి ఏపీ మూడు విధాలుగా ముందుకెళ్తాంది. పునఃనైపుణ్యం, పునర్నిర్వచించడం, పునఃఊహించడం ద్వారా ముందుకెళ్తున్నాం. మేం నైపుణ్యం అనే ప్లాట్‌ఫాంను రూపొందించాం. కృత్రిమ మేధ మానవాళికి ముప్పు కాదు.. మానవత్వాన్ని తీర్చిదిద్దుతుంది' అని పేర్కొన్నారు.
'ఐటీ రంగం వల్లే పారిశ్రామికవేత్తలు అభివృద్ధి సాధిస్తారు. ఫుడ్ ప్రాసెసింగులో వ్యాపారవేత్తలు పురోగతి సాధిస్తున్నారు. నెలకు రూ.50 వేలు సంపాదించే వ్యాపారవేత్త రూ.లక్ష సంపాదించేలా ప్రయత్నిస్తున్నాం. నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తుంటే.. దాన్ని రూ.25 లక్షలకు అభివృద్ధి చేసేలా పనిచేస్తున్నాం. ఇలా చేసినప్పుడే 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి చేరుకుంటాం. ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలతో పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం' అని నారా లోకేశ్ అన్నారు.