ఏపీ మంత్రి కొడాలి నాని దిగివచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన షోకాజ్ నోటీసు ఆయనపై బాగానే పనిచేసింది. దీంతో ఆయన మాట మార్చారు. తాను ఎస్ఈసీని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదన్నారు. పైగా, రాజ్యాంగ వ్యవస్థలపై తనకు ఎంతో గౌరవం ఉందని వివరణ ఇచ్చారు.
గురువారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘంతో పాటు.. కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కించపరిచేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను టీవీ ఫుటేజీల్లో చూసిన ఎస్ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసు జారీచేసింది.
మీడియాలో ప్రసారమైన ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల కమిషన్.. పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా గాని, ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని పేర్కొంది.
దీంతో మంత్రి కొడాలి నాని దిగివచ్చారు. ఎస్‌ఈసీ షోకాజ్ నోటీస్‌కు వివరణ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయంపైనే మాట్లాడానని చెప్పారు.
ప్రతిపక్షాల వేధింపులను ప్రస్తావించానని తెలిపారు. ఎస్‌ఈసీని కించపరిచే ఉద్దేశం, ఆలోచన లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవముందన్నారు. వివరణ పరిశీలించి షోకాజ్ నోటీస్ ఉపసంహరించుకోవాలని కొడాలి నాని కోరారు.