మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ రాష్ట్రపతికి ఒక విజ్ఞప్తి చేసింది. హెలికాఫ్టర్ కొనుకోలు చేసేందుకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా ఆమె కోరింది. ఈ మేరకు ఆమె రూపొందించిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌లోని అగర్ గ్రామానికి చెందిన బసంతి బాయి లోహర్‌కు కొంత వ్యవసాయ భూమి ఉంది. ఈ గ్రామానికి చెందిన రైతు పర్మానంద్ పటిదార్, ఆయన ఇద్దరు కుమారులు లవ్, కుష్ ఆమె పొలానికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. దీనిపై స్థానిక అధికారులకు ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
దీంతో ఆవేదనకు గురైన బసంతి బాయి దీని గురించి ఏకంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు లేఖ రాసింది. రైతు పర్మానంద్ పటిదార్, ఆయన ఇద్దరు కుమారులు తన పొలానికి వెళ్లే దారిని మూసివేశారని అందులో ఆరోపించింది.
వ్యవసాయంపైనే తాను ఆధారపడి జీవిస్తున్నానని, దీంతో తన పొలానికి వెళ్లే మార్గం లేదని వాపోయింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్‌లో పొలానికి వెళ్లి సాగు చేసుకుంటానని, దీనిని అధికారులు ఏర్పాటు చేయాలి లేదా కొనేందుకు రుణం, సంబంధిత లైసెన్స్ కోసం సహాయం చేయాలని రాష్ట్రపతిని ఆ లేఖలో కోరారు.
బసంతి ఆవేదనను ఒక వ్యక్తి హిందీలో ఈ మేరకు టైప్ చేశారు. పైగా, ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే యశ్‌పాల్ సింగ్ స్పందించారు. ఆ మహిళకు తాను సహాయం చేస్తానని చెప్పారు. అయితే హెలికాప్టర్ ఏర్పాటు కాదని, ఆమె తన పొలానికి వెళ్లేలా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.